సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయా రంగ ప్రవేశంపై తమిళనాడులో వివాదం రగులుతోంది. రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలని సూపర్ స్టార్ అభిమానులు ఎప్పటి నుంచో కోరుతున్న విషయం తెలిసిందే. అయితే దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతితో ప్రస్తుతం తమిళ రాజకీయల్లో స్తబ్తత కారణంగా..తుగ్లక్’ పత్రిక వార్షికోత్సవం సభ వేదికగా పలువురు నేతలు రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాల్సిందేనని ఒత్తిడి చేయగా, దీనిపై నటుడు శరత్ కుమార్ స్పందించారు. రజనీ పాలిటిక్స్ లోకి వస్తే అడ్డుకుని తీరతామని నటుడు శరత్ కుమార్ హెచ్చరించడం పెను దుమారాన్ని రేపుతోంది. “రజనీకి తమిళనాడు ప్రజల కష్టాలు, కన్నీళ్ల గురించి తెలియవు. సూపర్ స్టార్ గా, నటుడిగా నాకు రజనీకాంత్ పై గౌరవం ఉంది. అయితే, రాజకీయాల్లోకి వస్తానంటే మాత్రం కుదరదన్నారు.
ఎందరో మహా నేతలు తమిళనాడు గడ్డపై జన్మించారు. వారం రోజులు తమిళనాడులో, మరో వారం కర్ణాటకలో ఉండే రజనీకాంత్ కు సీఎం అయ్యే అర్హత లేదు” అని శరత్ కుమార్ నిప్పులు చెరిగారు. తమిళ సంప్రదాయాలపై ఆయనకు అవగాహన లేదని, ఈ విషయం ఎంతో మందికి తెలుసునని అన్నారు. కాగా, శరత్ కుమార్ వ్యాఖ్యలపై ఇప్పుడు తమిళనాట నిరసనలు చెలరేగుతున్నారు. శరత్ కుమార్ దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తూ, రోడ్లపై ధర్నాలు జరుగుతున్నాయి. రజనీకాంత్ అభిమానులను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. కాగా, ఈ విషయంలో రజనీ మాత్రం ఇంకా స్పందించలేదు.