శంకర్ దర్శకత్వంలో ‘2.O’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. దాదాపు రూ. 500కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న చిత్రమిది. దర్శకుడు శంకర్ ‘2.O’ని రోబో అంతకుమించి విజువల్ ఎఫెక్ట్స్ ని ప్లాన్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇప్పటికీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర పనులు పూర్తి చేసుకుంటోంది. వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. ఇవి వీలైనంత త్వరగా పూర్తి చేసి 2018 జనవరి 26న విడుదల చేయాలని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్ణయించింది.
అయితే వీఎఫ్ఎక్స్ పనులు అప్పటికి పూర్తయ్యే అవకాశం కనిపించకపోవడంతో ఈ సినిమా విడుదల తేదీని మారుస్తున్నట్టు లైకా ప్రొడక్షన్స్ తెలిపింది. 2018 ఏప్రిల్ 27న సినిమా విడుదల చేస్తామని వెళ్లడించింది. ఈ మేరకు లైకా ప్రొడక్షన్స్ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
అందులో ‘‘అత్యాధునిక హంగులతో అద్భుతమైన 3డీ చిత్రంగా ‘2.ఓ’ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శంకర్. అందుకు సంబంధించిన పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి.2018 ఏప్రిల్ నెలలో సినిమాను విడుదల చేయాలని నిర్ణయించాం. అప్పటికి అన్ని పూర్తవుతాయి’’అని పేర్కొంది.
కాగా, గతంలో ఈ సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 12న రజనీకాంత్ పుట్టినరోజును పురస్కరించుకుని విడుదల చేస్తామని తెలిపింది. అయితే వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాకపోవడంతో ట్రైలర్ అయినా విడుదలవుతుందా? అని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.