దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత సోమవారం రజనీకాంత్ తన అభిమానులను ప్రత్యక్షంగా కలుసుకున్నారు. మూడు జిల్లాల అభిమానులు ఆయన్ను కలుసుకునేందుకు చెన్నై రాగా, రాఘవేంధ్ర కల్యాణ మండపంలో ఏర్పాట్లు చేశారు. కన్యాకుమారి, దుండిగల్ జిల్లాల అభిమానులను నేడు ఆహ్వానించారు. రజనీకాంత్, సభా వేదికకు రాగా, అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. బాబా చిత్రంలో రజనీ చూపించే తనదైన ముద్రను చూపుతూ అభిమానులు కోలాహలం చేశారు. నల్లటి దుస్తుల్లో వేదిక నెక్కిన ఆయన వెంట సీనియర్ దర్శకుడు ఎస్పీ ముత్తురామన్ ఒక్కరే ఉన్నారు. ఇద్దరూ నల్లదుస్తులతోనే సభకు వచ్చారు.
అభిమానులను ఉద్దేశించి ప్రసంగించిన రజనీ, తనపై చూపిస్తున్న ఇంతటి ఆదరణను జీవితాంతమూ మరచిపోబోనని చెప్పారు. తాను రాజకీయాల్లోకి రావాలని ఎంతో కాలం నుంచి అభిమానులు డిమాండ్ చేస్తున్నారని, వారు అలా కోరడంలో తప్పులేదని అన్నారు. తాను రాజకీయాల్లోకి వస్తే డబ్బు ఆశ ఉన్నవారిని దగ్గర చేర్చుకునే సమస్యే లేదని స్పష్టం చేశారు.
తమిళనాడు రాజకీయాల్లో తానెప్పుడూ పాలుపంచుకోలేదని, ఎన్నడూ ఏ పార్టీకీ మద్దతివ్వలేదని సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యానించారు. అన్ని రాజకీయ పార్టీలు సమయానుసారం తన పేరును వాడుకున్నాయని ఆరోపించారు. ఇకపై అలా జరగనివ్వబోనని చెప్పారు. కొన్ని పార్టీలు తన పేరును వాడుకుంటుంటే అభిమానుల్లో సైతం పలుమార్లు ఎవరికి ఓటు వేయాలన్న విషయంలో సందిగ్ధత ఏర్పడిందని తెలిపారు. అభిమానులు మరిన్ని సంక్షేమ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా రజనీ సూచించారు. ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా, దాన్ని తీర్చేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలు తీర్చేందుకు డబ్బు అక్కర్లేదని, మీలో ఉన్న నిబద్ధత, అంకితభావమే చాలని రజనీ చెప్పినప్పుడు అభిమానుల నుంచి కరతాళ ధ్వనులు మిన్నంటాయి.
తాను ఎవరికీ భయపడేది లేదని అన్నారు. భయం అన్నది తనలో, తన అభిమానుల్లో ఏ మాత్రం కనిపించదని చెప్పారు. ప్రత్యేకంగా రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఆయన చెప్పకపోయినా, రజనీ ప్రసంగం రాజకీయాల ప్రస్తావనతోనే మొదలైంది. ఇక ఈ నెల 20 నుంచి తన కొత్త సినిమా మొదలవుతుందని ఆయన తెలిపారు. తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరితో ఫోటో దిగుతానని, తనతో ఫోటో వారికి ఎంత ఆనందాన్ని అందిస్తుందో, తనకు అంతకన్నా ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుందని ఆయన అన్నప్పుడు అభిమానులు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. నేటి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ మూడు జిల్లాల నుంచి వచ్చిన అభిమానులతో గడపనున్న రజనీ, వచ్చిన వారందరితోనూ ఫోటోలు దిగనున్నారు.