అసెంబ్లీలో మంత్రులు తిట్టుకోవడం, ఒకరిపై మరొకరు పేపర్లు విసురుకోవడం, కొట్టుకోవడం చూస్తూనే ఉంటాం. తాజాగా రాజస్థాన్ లో ఓ మంత్రి మరో మంత్రిపై చేయిచేసుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. అయితే ఈ సంఘటన ఓ మంత్రి ఇంట్లో జరగడం విశేషం.
శిఖర్ జిల్లా ఖండేలా నియోజక వర్గంలో టీచర్ల బదిలీలు సక్రమంగా జరగడం లేదని ఆరోపణలు వచ్చాయి. సొంత నియోజక వర్గంలో ఇలాంటి ఆరోపణలు రావడంతో ఆరోగ్య శాఖ మంత్రి బన్షీధర్ బజియా సీరియస్ అయ్యారు. ఈ విషయంపై ఆరా తీయడానికి విద్యాశాఖ మంత్రి అయిన వసుదేవ్ ఇంటికి వెళ్లారు. తన నియోజక వర్గంపై పక్షపాత ధోరణి చూపిస్తున్నావంటూ బజీయా, వసుదేవ్ పై మండిపడ్డారు.
ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ మంత్రి వసుదేవ్ పై బజియా చేయి చేసుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై వసుదేవ్ మాత్రం స్పందించలేదు. కానీ బజియా మాత్రం ఈ వార్తల్లో నిజం లేదని వ్యాఖ్యానించారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని బజియా అన్నారు.
సోషల్ మీడియాలో వాస్తవం లేని వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు బీజేపీ మంత్రుల వివాదాన్ని కాంగ్రెస్ నేతలు అస్త్రంగా మార్చుకుంటున్నారు. బీజేపీ నేతల తీరుపై మండిపడుతున్నారు. బీజేపీ నేతల నిజస్వరూపం ఇద్దంటూ ఆరోపిస్తున్నారు.