‘గరుడవేగ’ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాజశేఖర్ కథానాయకుడిగా రూపొందిన సినిమా ఇది. ఈ సినిమా వచ్చేనెల 3వ తేదీన భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో రాజశేఖర్ మాట్లాడుతూ, ఇటీవల చనిపోయిన తన తల్లిని తలచుకుని కంటతడి పెట్టారు. ఈ సినిమా విడుదలకు ముందు తన తల్లిని కోల్పోవడమే ఆయనంత ఉద్వేగానికి గురవడానికి కారణం. తన సక్సెస్ చూడాలని తన తల్లి ఎంతో తపించిందని.. కానీ ‘గరుడవేగ’ విడుదలకు కొన్ని రోజుల ముందే ఆమె చనిపోవడంతో తన నెత్తిన పిడుగు పడ్టట్లయిందని రాజశేఖర్ అన్నాడు.
అంతేకాదు తన బావ మరిది మురళి కూడా ఇదే సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడని.. అతడి ఆరోగ్యం విషమంగా ఉన్న సమయంలో బాధను దిగమింగుకుని ఈ వేడుకకు వచ్చామని రాజశేఖర్ తెలిపాడు. ప్రి రిలీజ్ ఈవెంట్లో రాజశేఖర్ ఇంకా ఏమన్నాడంటే..‘‘గరుడ వేగ నా కెరీర్లో ప్రత్యేకమైన సినిమా. మా టీజర్ కు ఐదు రోజుల్లోనే 5 మిలియన్ వ్యూస్ వచ్చాయని తెలిసినపుడు చాలా సంతోషించా. ఆ సమయంలో మా అమ్మ నా దగ్గరే ఉన్నారు. తన కొడుక్కి చాలా రోజుల తర్వాత విజయం రాబోతోందని సంతోషంగా కనిపించారు.
అయితే నేను సినిమాల్లో చాలా నష్టపోయానని మా అమ్మానాన్నలకు బాధ. చెన్నైలో ఉన్న ఆస్తులు అమ్మి ఇక్కడ సినిమాలు చేశా. నాకు సూటవ్వని కొన్ని సినిమాలు చేసి ఇబ్బంది పడ్డా. నాకే బాధ కలిగి ఇక సినిమాలే తీయకూడదు అనుకొని ఇంటి దగ్గర ఉండిపోయా. అలాంటి సమయంలో ‘గరుడవేగ’ చేసే అవకాశం వచ్చింది. ఇంతలోనే మా అమ్మగారు దూరం కావడంతో నామీద ఓ పెద్ద పిడుగు పడినట్టైంది. నాకు ప్రతి క్షణం అమ్మే గుర్తుకొస్తోంది. జీవిత సోదరుడు.. ఈ సినిమా లైన్ ప్రొడ్యూసర్ మురళి ఆరోగ్యం కూడా విషమంగా ఉంది. కుటుంబమంతా మా బాధల్ని దిగమింగుకొని సినిమా కోసం అందరి ముందుకూ వచ్చాం. అందరూ థియేటర్లలో సినిమాని చూసి మమ్మల్ని ఆదరించాలని కోరుకొంటున్నాం’’ అని రాజశేఖర్ అన్నాడు.