వరుస ఓటములతో ఢీలాపడిన గుజరాత్ లయన్స్ ఎట్టకేలకు మళ్లీ విజయాన్ని అందుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో సురేశ్ రైనా (84) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో 188 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.దీంతో హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న కోల్‌కతాను దాని సొంతగడ్డపై మట్టికరిపించి సత్తా చాటింది గుజరాత్.
గుజరాత్ విధించిన 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌కు ఓపెనర్లు మంచి శుభారంభాన్నందించారు. ఓపెనర్లు ఫించ్ (31; 15 బంతుల్లో 4×4, 2×6), మెక్‌కలమ్ (33; 17 బంతుల్లో 5×4, 1×6) మెరుపు ఆరంభాన్నిచ్చారు. పవర్ ప్లే అయ్యేసరికే స్కోరు 72కు చేరుకుంది. తర్వాత వచ్చిన దినేశ్ కార్తీక్ (3), ఇషాన్ కిషన్ (4), డ్వేన్ స్మిత్ (5) నిరాశపరిచారు. సురేశ్ రైనా (84; 46 బంతుల్లో 9×4, 4×6) కెప్టెన్ ఇన్నింగ్స్ ఇడాడు. తన పని సాఫీగా పూర్తి చేశాడు.కోల్‌కతా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తున్నా.. రైనాను అడ్డుకోలేకపోయారు. సాధించాల్సిన రన్‌రేట్ అదుపులో ఉండటంతో రైనా పెద్దగా ఇబ్బంది పడకుండానే.. జడేజా (19 నాటౌట్; 13 బంతుల్లో 1×4, 1×6)తో కలిసి పని పూర్తి చేశాడు. రైనా ధాటికి కోల్‌కతా బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
అంతకముందు టాస్ గెలిచిన కోల్ కతా బ్యాటింగ్ ఎంచుకుంది. నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో నరైన్ బ్యాటింగే హైలైట్. లిన్ గాయపడ్డాక అనుకోకుండా ఓపెనర్ అవతారమెత్తి ఓ మ్యాచ్‌లో మెరుపులు మెరిపించిన నరైన్.. శుక్రవారం గుజరాత్ బౌలర్లను ఆటాడుకున్నాడు. కొడితే ఫోరో.. సిక్సరో అన్నట్లే సాగింది అతడి ఆట. నరైన్ చేసిన 42 పరుగుల్లో అన్నీ బౌండరీలే. 0, 4, 0, 0, 4, 4, 4, 0, 4, 4, 4, 0, 4, 4, 6, 0.. ఔటయ్యే ముందు నరైన్ ఎదుర్కొన్న 16 బంతుల్లో పరుగుల ప్రవాహం సాగిన తీరిది.
తర్వాత రాబిన్ ఉతప్ప (72) హాఫ్ సెంచరీతో రాణించాడు.మనీష్ పాండే (24) క్రీజులో కుదురుకోవడంతో కోల్‌కతా స్కోరు 200 వైపు సాగేలా కనిపించింది. ఐతే చివరి ఓవర్లలో లయన్స్ బౌలర్లు పుంజుకుని నైట్‌రైడర్స్‌ను కట్టడి చేశారు. తొలి మూడేసి ఓవర్లలో భారీగా పరుగులిచ్చేసిన ఫాల్క్‌నర్, తంపి తమ చివరి ఓవర్లలో వరుసగా 5, 7 పరుగులే ఇవ్వడం విశేషం. దీంతో నైట్‌రైడర్స్ 187 పరుగులకే పరిమితమైంది.