భాగ్యనగరంలో భారీ వర్షం.. అధికారులు అప్రమత్తం..

142
- Advertisement -

హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్‌, ఖైర‌తాబాద్, జూబ్లీహిల్స్, కొండాపూర్, హైటెక్‌సిటీ, కూక‌ట్‌ప‌ల్లి, సోమాజిగూడ‌, బేగంపేట‌, సికింద్రాబాద్, తార్నాక‌, ఉప్ప‌ల్, ఎల్బీన‌గ‌ర్‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌, హయ‌త్‌న‌గ‌ర్‌, సంతోష్‌న‌గ‌ర్‌, చాద‌ర్‌ఘాట్‌, కోఠి, అఫ్జ‌ల్ గంజ్, జియ‌గూడ‌, లంగ‌ర్‌హౌజ్, ల‌క్డీకాపూల్, మెహిదీప‌ట్నం, టోలిచౌకీ, రాజేంద్ర‌న‌గ‌ర్ త‌దిత‌ర ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసింది. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో భారీ వర్షం నేపథ్యంలో అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కాగా, నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు పోటెత్తింది. దాంతో కొన్నిచోట్ల వాహనాలు నీట మునిగిన పరిస్థితి కనిపించింది.

ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ సందర్భంగా ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసింది. ఏవైనా ఫిర్యాదులుంటే కాల్‌ సెంటర్‌ నంబర్‌ 040-21111111 నంబరులో సంప్రదించాలని జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి సూచించారు. వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. వరద తొలగింపునకు సిద్ధంగా సిబ్బందిని ఆదేశించారు. అలాగే కంట్రోల్‌ రూమ్‌లోనూ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇదిలా ఉండగా.. శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమవగా.. వాహనదారులు, జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

- Advertisement -