రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల, పొచ్చెర జలపాతాల్లో నీటి ప్రవాహం పెరిగింది. మహబూబాబాద్ జిల్లా ఏటూరునాగారం సమీపంలోని జంపన్నవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం 9 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. శనివారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
రాష్ట్రంలో ఇరవైకిపైగా జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిశాయి. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడ్డాయి. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్-ఎస్‌లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి జిల్లాల్లోని 20 ప్రాంతాల్లో 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది.