కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అధికారిక ట్విట్టర్ హ్యాక్ అయింది. రాహుల్ ట్విట్టర్‌ను లక్ష్యంగా చేసుకున్న హ్యాకర్లు నానారకాల దుర్భాషలు ఆడుతూ ట్వీట్లు చేశారు. రాహుల్ సోషల్ మీడియా టీమ్ దీన్ని గుర్తించే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ ట్వీట్లను తొలగించినప్పటికీ.. లాభం లేకుండా పోయింది. రాహుల్ ఖాతాలోని ఈ అభ్యంతరకరమైన ట్వీట్లు ప్రింట్ స్క్రీన్‌ల రూపంలో నెటిజన్లకు చేరిపోయాయి. రాజకీయ కుట్రలో భాగంగానే రాహుల్ ట్విట్టర్ హ్యాక్ అయిందని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి.
దీనిపై కాంగ్రెస్ నేతలు గురువారం ఉదయం ఢిల్లీ సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, నెటిజన్లు మాత్రం రాహుల్ అకౌంట్ హ్యాక్‌పై సానుభూతి వ్యక్తం చేస్తూనే.. మరోసారి జోకులు పేల్చారు. ఇప్పటికీ బాల్యపుఛాయలు వీడని రాహుల్ తన పాస్‌వర్డ్ ఛోటాభీమ్ అని పెట్టుకొని ఉంటాడని, అందుకే అలవోకగా హ్యాకర్లు ఆయన అకౌంట్‌ను హ్యాక్ చేయగలిగారని ఓ నెటిజన్ ఛలోక్తి విసురుగా.. ట్విట్టర్ అకౌంట్ పాస్‌వర్డ్ శక్తిమంతంగా ఉండాలనే ఉద్దేశంతో రాహుల్ నరేంద్రమోడీ పేరును పాస్‌వర్డ్‌గా పెట్టుకొని ఉంటాడని మరొకరు ట్వీట్ చేశారు.
మరోకరైతే రాహుల్: అమ్మ నా అకౌంట్ హ్యాక్ అయింది. సోనియా: ఏ అకౌంట్. రాహుల్: ట్విట్టర్. సోనియా: థ్యాంక్ గాడ్. నేను స్విస్ అకౌంట్ అనుకున్నా’ అంటూ మరో నెటిజన్ జోక్‌ను పోస్ట్‌చేశాడు. ఇంకొందరైతే ట్విట్టర్ పాస్ వర్డ్ మార్చుకునేందుకు రాహుల్ ఏటీఎం సెంటర్‌కు వెళ్లారని ట్విట్ చేస్తున్నారు.ఇలాంటి జోకులు కుప్పలుతెప్పలుగా ట్విట్టర్‌లో ప్రస్తుతం హోరెత్తుతున్నాయి.