రాహుల్‌తో‌..కాంగ్రెస్‌ గట్టెక్కేనా..!

186
Rahul Unchallenged set To Be Congress President
- Advertisement -

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా యువరాజు రాహుల్‌ గాంధీ(47) పట్టాభిషేకానికి సర్వం సిద్దమైంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధానకార్యాలయంలో సీనియర్ నేతల సమక్షంలో రాహుల్ నామినేషన్‌ దాఖలు చేశారు.  సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ తదితర నేతలు రాహుల్‌ని అధ్యక్షుడిగా ప్రతిపాదించగా 4 సెట్లపై 40 మంది సంతకాలు చేశారు.  రాహుల్ గాంధీకి పోటీగా ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆయన ఎన్నిక లాంచనమే కానుంది. నెహ్రూ కుటుంబంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆరో వ్యక్తిగా రాహుల్‌ నిలవనున్నారు.

అత్యధిక కాలం ఏఐసీసీ అధ్యక్షురాలిగా పని చేసిన రికార్డు సోనియా గాంధీ(దాదాపు 20 ఏళ్లు) పేరిట ఉంది. 1998లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన సోనియా రెండుసార్లు ఆపార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషిచేసింది. ఒకాన దశలో కాంగ్రెస్ పనైపోయిందిరా..అనుకుంటున్న సమయంలో సోనియా..తన అత్త ఇందిరాగాంధీలా మారిపోయారు. పార్టీ బాధ్యతలు తన భుజాన వేసుకుని దేశమంతా సుడిగాలి పర్యటన చేస్తూ 2004లో పార్టీని అధికారంలోకి  తీసుకొచ్చారు.

 Rahul Unchallenged set To Be Congress President
అయితే సరిగ్గా పదేళ్ల తర్వాత అంటే 2014లో సీన్ రివర్సైంది.  దేశమంతా మోడీ గాలి వీచడంతో పార్లమెంట్‌లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్ధితి నెలకొంది. దీంతో పాటు గత నాలుగేళ్లలో పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీనే విజయఢంకా మోగించింది. దీంతో కాంగ్రెస్ నైరాశ్యంలో పడిపోయింది. ఇటు కార్యకర్తల్లోనూ, అటు నేతల్లోనూ ఒకటే నిరాశ.

ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రాహుల్‌కు ముందుంది ముళ్లబాటే. నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్‌ను బ్రతికించడం ఆయన ముందున్న పెద్దసవాల్‌. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా గుజరాత్‌ ఎన్నికలను ఎదుర్కొనబోతున్న రాహుల్‌….కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకొస్తాడా లేదా అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.

rahul-gandhi-pranab-mukherjee-pti_650x400_51512372372
ముఖ్యంగా 2019 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావించే కర్నాటక, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఒడిశా, మేఘాలయా, మిజోరాం, నాగాలాండ్‌, త్రిపుర, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌లు బీజేపీ పాలిత రాష్ట్రాలు. ఇందులో కనీసం సగం రాష్ట్రాల్లో అయినా రాహుల్‌ పార్టీని విజయతీరాలకు చేర్చితేనే.. 2019పై అంచనాలు పెరుగుతాయి.

అయితే, రాహుల్ ఎత్తుగడలు ఫలించి గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తే ఆయనకు తిరుగుండదు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే ఇప్పటికే ఐరెన్‌ లెగ్‌గా ముద్రవేసుకున్న రాహుల్‌ కెప్టెన్సీలో తొలి ఓటమి మూటకట్టుకోవడంతో పాటు పార్టీలోను రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొకతప్పదేమో.  మొత్తంగా గుజరాత్ ఎన్నికల గెలుపు బీజేపీ కంటే రాహుల్‌కు ప్రతిష్టాత్మకంగా మారాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

rahul gandhi

- Advertisement -