లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగేందుకు సిద్ధమైన రాహుల్ గాంధీ తొలిసారిగా స్పందించారు. శనివారం జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడిన ఆయన బీజేపీపై ప్రతి రోజు పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే తనముందున్న కర్తవ్యమన్నారు.
మరోవైపు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా సోనియాగాంధీని ఎన్నుకున్నారు. సోనియా పేరును మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రతిపాదించగా.. సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తరువాత కాంగ్రెస్ తీసుకున్న కీలక నిర్ణయం ఇదే కావడం గమనార్హం.
ఈ సమావేశానికి లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన 52 మంది కాంగ్రెస్ సభ్యులు, 50మంది రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. ప్రస్తుత లోక్‌సభలో కాంగ్రెస్‌కు 52 మంది ఎంపీలు ఉన్నారు. ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కాలంటే ఇంకా ముగ్గురు సభ్యుల మద్దతు కావాల్సి ఉంది.