మే 13 న జరిగే సార్వత్రిక ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత కీలకంగా తీసుకుంది. 2014 లో అధికారం కోల్పోయిన హస్తం పార్టీ 2019 లోనూ ఓటమి చవిచూసింది. దాంతో ఈసారి తెలిచి పూర్వవైభవం సంపాధించుకోవాలని గట్టి పట్టుదలగా ఉంది. అందుకే ఇతర పార్టీలను కూడా కలుపుకుని ఇండియా కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంచితే కాంగ్రెస్ అగ్రనేతలు పోటీ చేసే స్థానాలపై దేశ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈసారి ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇక హస్తం పార్టీ అధినేత్రి సోనియా గాంధీ లోక్ సభ కు కాకుండా రాజ్యసభకు వెళ్ళడంతో ఆమె కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు ఇక మిగిలింది రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.
వీరిద్దరు ఏ ఏ స్థానాల నుంచి బరిలో దిగబోతున్నారనేది క్యూరియాసిటీని ఎంచుతున్న అంశం. రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో వయనాడ్, అమేథీ సీట్లలో పోటీ చేశారు, అయితే వయనాడ్ లో గెలవగా అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో ఓటమి చవిచూశారు. దాంతో ఈసారి రెండు చోట్ల పోటీ చేస్తారా లేదా ఒకే స్థానాన్ని ఎంచుకుంటారా అనే సందేహాలు వ్యక్తమౌతూ వచ్చాయి. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ ఎన్నికల్లో కూడా రెండు చోట్ల పోటీ చేసేందుకే రాహుల్ గాంధీ మొగ్గుచూతున్నారట.
గత ఎన్నికల పోటీ చేసిన వయనాడ్, అమేథీ స్థానాలలోనే మళ్ళీ పోటీ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇక ప్రియాంక గాంధీ విషయానికొస్తే ఈసారి రాయ్ బరేలీ నుంచి బరిలో దిగే ఆలోచనలో ఉన్నారట. ఎందుకంటే గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్ళడంతో ఈ సీటు ఖాళీ అయింది. దాంతో కాంగ్రెస్ కంచుకోటగా ఉండే ఈ స్థానంలో ప్రియాంక గాంధీ బరిలోకి దిగితే మేలని అధిష్టానం భావిస్తున్నట్లు టాక్. త్వరలో విడుదల చేయబోయే మొదటి జాబితాలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి కాంగ్రెస్ కంచుకోటలలో పార్టీ అధినేతలు ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.
Also Read:సుప్రీంకు క్షమాపణ చెప్పిన పతంజలి..