రాహుల్ నేతృత్వంలో మన పార్టీకి కొత్త జోష్ వస్తుంది. నా తనయుడి సహనశీలత, దృఢత్వాన్ని చూసి గర్విస్తున్నా. తల్లిగా నేను ఇంతకంటే పొగడటం బాగుండదు’ అని సోనియాగాంధీ పేర్కొన్నారు. బాధ్యతలను తనయుడికి అప్పగిస్తున్న సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో శనివారం ఆమె చివరి ప్రసంగం చేశారు. దేశంలో మతోన్మాద శక్తులను నిలువరించేందుకు ఏ త్యాగానికైనా సిద్ధం గా ఉండాలని, దానికన్నా ముందుగా కాంగ్రెస్ తన ఇంటిని చక్కదిద్దుకోవాలని సోనియాగాంధీ పేర్కొన్నారు. గత 19 ఏండ్లుగా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సోనియాగాంధీ తాజాగా పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన రాహుల్‌గాంధీకి బాధ్యతలు అప్పగించారు.
తన కొడుకుపై సాగిన భయంకరమైన వ్యక్తిగత దాడులు, విమర్శలు అతడిని నిర్భయుడిని చేశాయని అంటూ యువ నాయకత్వం పార్టీలో కొత్త శక్తిని నింపగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ పార్టీని ధైర్యంగా, అంకితభావంతో నడిపించగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశం ప్రస్తుతం అసాధారణమైన సవాళ్లను ఎదుర్కొంటున్నదని, అయితే కాంగ్రెస్ వాటికి భయపడదని నొక్కి చెప్పారు. మన ప్రాథమిక విలువలు, వాక్ స్వాతంత్య్రం, భావప్రకటన స్వేచ్ఛ, మన భిన్నమైన సంస్కృతిపై ప్రతిరోజు దాడులు జరుగడాన్ని చూస్తున్నాం.
భయం, అనుమానంతో కూడిన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఆత్మవిమర్శ చేసుకొని ముందుకు సాగాలి.. తన విలువలకు కట్టుబడి ఉండాలి.. ఇది నైతిక యుద్ధం.. ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండా లి అని అన్నారు. హింస కారణంగా ఎదురైన వేదనను తన కుమారుడు చిన్నప్పటి నుండే అనుభవించాడని రాహుల్‌ను గూర్చి ఆమె చెప్పారు. పార్టీ అధ్యక్షురాలిగా తనకు సహకరించిన నాయకులు, కార్యకర్తలందరికీ ఆమె ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. భావోద్వేగంగా సాగిన ప్రసంగంలో తన అత్త ఇందిరాగాంధీ, భర్త రాజీవ్‌గాంధీల హత్యలు జరుగడాన్ని, రాజకీయాల్లోకి వచ్చేందుకు నిరాకరించిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.