కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ(47) కాంగ్రెస్ పగ్గాలు చేపట్టేందుకు ముహూర్తం ఖరారైంది. తన తల్లి, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ నుంచి ఈ నెల 16వ తేదీన రాహుల్ అధికారికంగా పార్టీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా దాఖలైన మొత్తం 89 నామినేషన్లు రాహుల్‌కు అనుకూలంగా వచ్చాయి. నామినేషన్ల ఉపసంహరణకు గడువు 10వ తేదీతో ముగిసింది.
దీంతో రాహుల్ నామినేషన్ మాత్రమే ఉండటంతో ఆయన్ను అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటించటమే మిగిలింది. ఈ క్రమంలోనే డిసెంబర్ 16వ తేదీన ఉదయం 11 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ నియామక ఉత్తర్వులు అందుకుంటారని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ ఛైర్మన్ ఎం.రామచంద్రన్ తెలిపారు. సోనియా సమక్షంలో రాహుల్ అధ్యక్ష పదవి బాధ్యతలను స్వీకరించనున్నారు.
కాగా..గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల వెల్లడికి రెండు రోజులు ముందుగా రాహుల్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనుండటం విశేషం.