130 ఏళ్ల కాంగ్రెస్ పార్టీలో నూతన శకం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలను స్వీకరించారు. నెహ్రూ కుటుంబం నుంచి కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన ఆరో వ్యక్తిగా రాహుల్ నిలిచారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధ్యక్షుడిగా రాహుల్ బాధ్యతలను అందుకున్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన ధ్రువీకరణ పత్రాన్ని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం అధ్యక్షుడు రామచంద్రన్ సోనియా సమక్షంలో రాహుల్‌కు అందజేశారు.
1998 నుంచి 19 ఏళ్ల పాటు అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించిన సోనియా గాంధీ ఆ పదవి నుంచి వైదొలిగారు. రాహుల్ ప్రమాణ స్వీకార కార్యక్రమంతో ఏఐసీసీ ప్రధాన కార్యాలమంలో పండుగ వాతావరణం నెలకొంది. రాహుల్ నినాదంతో ఏఐసీసీ కార్యాలయం హోరెత్తిపోయింది. టపాసులు కాలుస్తూ.. మిఠాయిలు పంచుకుంటూ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్ దేశంపై నమ్మకంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ప్రతి ఒక్క భారతీయుడి గొంతుకగా మారేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. పదమూడేళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. దేశ సేవకు అంకితమైన కాంగ్రెస్ కార్యకర్తలకు రక్షణగా నిలవడం తన బాధ్యత అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మన దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకువచ్చిందని, ప్రస్తుత ప్రధాని దేశాన్ని తిరోగమనం వైపు నడిపిస్తున్నారని విమర్శించారు. ప్రజల మధ్య బీజేపీ విద్వేషాలు రెచ్చగొడుతోందని, ఒకసారి విద్వేషాలు చెలరేగితే అణచివేయడం చాలా కష్టమని రాహుల్ అన్నారు.
తన అత్త మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తనను ఓ కూతురిలా చూసుకుందన్నారు. భారత్ గురించి ఇందిరా నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నట్లు సోనియా తెలిపారు. 2014 నుంచి ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నామని, ఇప్పుడు దేశం ఓ పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నదని, రాజ్యాంగ విలువలపై దాడి జరుగుతుందని, తమ పార్టీ ఇటీవల చాలా వరకు ఎన్నికల్లో ఓటమి పాలైందని, కానీ తాము మాత్రం తలవంచబోమన్నారు. తాము బెదిరిపోయేవాళ్లం కాదు అని, ఎవరికీ తలవంచమని, దేశ హితం కోసం సంఘర్షణ చేస్తూనే ఉంటామని సోనియా అన్నారు.
కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు రాహుల్‌కు అప్పగించిన సోనియాకు సెల్యూట్ చేశారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. రాహుల్ గాంధీ అంకితభావం, పట్టుదల కొత్త ఉత్సాహాన్ని తెస్తుందని ఆశిస్తున్నట్లు మన్మోహన్ చెప్పారు. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కొత్త శిఖరాలను చేరుకుంటుందని భావిస్తున్నానని మన్మోహన్ ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీకి ఇది చరిత్రాత్మక రోజు అని, తాను భావోద్వేగానికి లోనవుతున్నట్లు మన్మోహన్ తెలిపారు.
As we officially welcome Congress President Rahul Gandhi into his role, we look back on his character-defining moments, and look forward to his continued compassionate, integrity-fuelled leadership. #CongressPresidentRahulGandhi #ThankYouSoniaGandhi pic.twitter.com/YylvZdwG1J
— Congress (@INCIndia) December 16, 2017