భారతదేశంలోని సంస్థాగత వ్యవస్థను బీజేపీ క్రమంగా తన నియంత్రణలోకి తీసుకుంటోందని కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి ఆరోపించారు. ఇది దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రత్యక్ష దాడి అని ఆయన వ్యాఖ్యానించారు. జర్మనీలోని బెర్లిన్‌లో ఉన్న హర్టీ స్కూల్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన రాహుల్ గాంధీ, కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను రాజకీయ ఆయుధాలుగా మార్చిందని ఆరోపించారు. వ్యాపార వర్గాలు ప్రతిపక్ష పార్టీలకు మద్దతు ఇవ్వకుండా బీజేపీకి ఆర్థిక సహాయం చేస్తే, వారికి లాభాలు చేకూర్చేలా ‘క్విడ్ ప్రో కో’ వ్యవస్థ నడుస్తోందని ఆయన అన్నారు.
ఈడీ, సీబీఐ వంటి సంస్థలను ఎంపికచేసి ఉపయోగిస్తున్నారని, బీజేపీపై కేసులు దాదాపు లేవని, ప్రతిపక్ష నేతలపైనే ఎక్కువగా రాజకీయ కేసులు నమోదవుతున్నాయని రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్‌కు మద్దతిచ్చే వ్యాపారవేత్తలను బెదిరిస్తున్నారన్న ఆరోపణ కూడా చేశారు. అధికార పార్టీకీ, ప్రతిపక్షాలకీ మధ్య ఉన్న వనరుల అసమానత దీనికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ పరిస్థితికి ప్రతిగా కాంగ్రెస్ పార్టీ ‘సంస్థల స్వాధీనానికి ఎదురుగా ప్రతిఘటన నిర్మాణం’ (structure of resistance) ఏర్పాటు చేస్తుందని రాహుల్ గాంధీ తెలిపారు. ఇది కేవలం బీజేపీకి వ్యతిరేకంగా కాదు, దేశ సంస్థాగత వ్యవస్థపై వారి ఆధిపత్యానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటమని స్పష్టం చేశారు.
ఇండియా కూటమిపై మాట్లాడుతూ, కొన్ని రాష్ట్రాలు, స్థానిక ఎన్నికల్లో భాగస్వామ్య పార్టీలు పరస్పరం పోటీ చేస్తున్నాయని అంగీకరించిన రాహుల్ గాంధీ, వాటిని ‘టాక్టికల్ కాంటెస్టులు’గా అభివర్ణించారు. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా మాత్రం ఇండియా కూటమి ఐక్యంగా ఉందన్నారు.
బీజేపీ రాజ్యాంగాన్ని, రాష్ట్రాలు–భాషలు–మతాల మధ్య సమానత్వ సూత్రాన్ని బలహీనపరచాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. దేశాన్ని ఒకే వ్యక్తి సంకల్పంతో నడపలేమని నమ్మే కోట్లాది మంది భారతీయులు ఉన్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రస్తుతం రెండు విభిన్న భారత దృక్పథాల మధ్య పోరాటం సాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read:KTR:పీవీ వర్ధంతి…కేటీఆర్ నివాళి

