సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో జరిగిన అక్రమాలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈసారి ఆయన కేంద్ర ప్రభుత్వ విధానాలను…సీబీఎస్‌ఈ తీరును జేబుదొంగల (Pickpockets) చర్యలతో పోల్చారు. బోర్డు కావాలనే విద్యార్థుల మార్కులలో తప్పులు దొర్లేలా చేసి, ఆ తర్వాత రీ-వెరిఫికేషన్, రీ-ఇవాల్యుయేషన్ ఫీజుల రూపంలో విద్యార్థుల నుండి కోట్ల రూపాయల లాభాలను అర్జిస్తోందని ఆరోపించారు.
రాహుల్ గాంధీ తన ‘ఎక్స్’ (X) ఖాతాలో.. మొదట మీ జేబులు కట్ చేస్తారు…ఆపై మీ దగ్గరే లాభాలు లాగుతారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొబైల్ ఫోన్ల ద్వారా జవాబు పత్రాలను నాసిరకంగా స్కాన్ చేయడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారని ఇప్పుడు తమ మార్కులను సరిచేసుకోవడానికి వారు మళ్లీ బోర్డుకు భారీగా ఫీజులు చెల్లించాల్సి వస్తోందని అన్నారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన పొరపాటు కాదు…ఒక పక్కా ప్రణాళికతో విద్యార్థులను దోపిడీ చేయడమేనని మండిపడ్డారు.
ఈ విద్యాసంబంధిత సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ఈ భారీ విద్యా కుంభకోణానికి బాధ్యత వహిస్తూ తక్షణమే విచారణ జరిపించాలని, నష్టపోయిన విద్యార్థులందరికీ న్యాయం చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు.. తల్లిదండ్రుల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
Also Read:మౌంట్ రష్‌మోర్‌పై ట్రంప్..!

