యూపీఏ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తెచ్చిన పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) ను రద్దు చేసి, దాని స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ లైవ్‌లీహుడ్ మిషన్ గ్రామీణ్ (VB–G RAM G) బిల్లును తీసుకువచ్చిన మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
మోదీ ప్రభుత్వం ఒక్క రోజులోనే 20 ఏళ్ల MGNREGAని ధ్వంసం చేసింది. VB–G RAM G అనేది MGNREGAకి అప్‌గ్రేడ్ కాదు. ఇది హక్కుల ఆధారంగా, డిమాండ్‌పై అమలయ్యే ఉపాధి హామీని కూల్చివేసి, ఢిల్లీ నుంచి నియంత్రించబడే పరిమిత పథకంగా మార్చింది. ఇది రూపకల్పన నుంచే రాష్ట్ర వ్యతిరేకం, గ్రామ వ్యతిరేకం అని మండిపడ్డారు రాహుల్.
MGNREGA గ్రామీణ కార్మికులకు బేరసార శక్తిని ఇచ్చిందని, దాంతో దోపిడీ తగ్గిందని, వలసలు తగ్గాయని, జీతాలు పెరిగాయని, పని పరిస్థితులు మెరుగయ్యాయని రాహుల్ గాంధీ తెలిపారు. గ్రామీణ మౌలిక సదుపాయాల నిర్మాణంలో ఈ పథకం కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. ఆ శక్తినే ఈ ప్రభుత్వం కూల్చాలని చూస్తోందని ఆరోపించారు.
కోవిడ్ మహమ్మారి సమయంలో MGNREGA కోట్లాది మందిని ఆకలి, అప్పుల నుంచి కాపాడిందని కాంగ్రెస్ నేతలు గుర్తు చేశారు. ముఖ్యంగా మహిళలు, దళితులు, ఆదివాసీలు, పేద ఓబీసీ వర్గాలకు ఈ పథకం పెద్ద అండగా నిలిచిందన్నారు. మహిళలు ప్రతి ఏడాది మొత్తం పనిదినాల్లో సగానికి మించిన వాటాను అందించారని తెలిపారు.
Also Read:సరస్వతి పుత్రిక చదువు కోసం హరీష్ ఔదార్యం..
VB–G RAM Gలో పనిపై పరిమితులు విధించడం ద్వారా గ్రామీణ పేదల వద్ద ఉన్న ఏకైక ఆయుధాన్ని బలహీనపరుస్తున్నారని రాహుల్ విమర్శించారు. ఉపాధి పథకాన్ని రేషన్ విధానంలా మార్చితే ముందుగా నష్టపోయేది మహిళలు, దళితులు, ఆదివాసీలు, భూమిలేని కార్మికులు, పేద ఓబీసీలేనని హెచ్చరించారు.

