టీకాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు.. రంగంలోకి రాహుల్‌ గాంధీ..

43
rahul
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్‌లో మొదలైన రచ్చ ఇప్పట్లో తగ్గే అవకాశం లేదా? గ్రూపు రాజకీయాలకు పుల్ స్టాప్ పెట్టే దిశగా రంగంలోకి దిగిన రాహుల్‌ గాంధీ మాటను కూడా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు బేఖాతరు చేయడం లేదా అంటే అవుననే తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సమయాత్తమవ్వాల్సిన తరుణంలో కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాల రచ్చతో క్యాడర్‌లో అయోమయం నెలకొన్న నేపథ్యంలో స్వయంగా రంగంలోకి దిగిన రాహుల్‌ గాంధీ పార్టీ కార్యకలాపాలను చక్కదిద్దే పనిని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్‌ అనుకూల వర్గం, వ్యతిరేక వర్గంతో రెండు గ్రూపులుగా ఉండడం, నిత్యం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, నువ్వా నేనా అంటూ నిత్యం కయ్యానికి కాలుదువ్వడంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో నిత్యం అయోమయం నెలకొంది. ప్రత్యర్థి పార్టీల విమర్శల కంటే నిత్యం స్వంత పార్టీలోని నేతలే పార్టీపై, నాయకులపై విమర్శల పర్వం కొనసాగిస్తుండడంతో అధిష్టానం సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపిస్తోంది.

టీ కాంగ్రెస్‌లో నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విబేదాలకు పుల్‌స్టాప్‌ పెట్టేందుకు స్వయంగా రంగంలోకి దిగిన రాహుల్‌ గాంధీ కూడా తెలంగాణ కాంగ్రెస్‌లో ఉన్న గొడవలకు అడ్డుకట్ట వేయడంలో తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. కాంగ్రెస్‌లో మొదలైన రచ్చను చల్లార్చడంలో భాగంగానే ఇటు రాహుల్‌ గాంధీ, అటు సోనియా గాంధీ తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు అపాయింట్‌మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీతో భేటీ పలు విషయాలు చర్చించారు. ప్రధానంగా ఈ భేటీలో రేవంత్‌ రెడ్డి అనుసరిస్తున్న విధానాలు, ఆయన ఒంటెద్దు పోకడలతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని, సీనియర్లను లెక్క చేయడం లేదని, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం అందడం లేదని రాహుల్‌ గాంధీకి తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్లు లీడర్లు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ, పార్టీలోని నేతలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, విబేధాలను పక్కన పెట్టి అందరూ పార్టీ అభివృద్ధికి పనిచేయాలని సూచించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా రేవంత్‌ రెడ్డికి రాహుల్‌ గాంధీ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. రేవంత్‌ తీరు మార్చుకోవాలని, నాయకులు, కార్యకర్తలు అందరినీ కలుపుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే రాహుల్‌ గాంధీ పార్టీ సీనియర్‌ నేతలను బుజ్జగించి రేవంత్‌ తో కలిసి పనిచేయాలని, విభేదాలను పక్కనపెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించినా.. వారంతా రాహుల్‌గాంధీ ఆదేశాలను అమలులో పెడతారా? … అందరూ కలిసి పనిచేస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనా రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ ఆదేశాలు ఏ మేరకు అమలయ్యాయనే విషయం మనకు తెలిసే అవకాశం ఉంది.

- Advertisement -