కర్ణాటక ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. ఓ వైపు మోడీ…మరోవైపు రాహుల్ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేల్చుతు పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు. ఆరోపణలు,ప్రత్యారోపణలతో కన్నడనాట ఎవరు గెలుస్తారో అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రచారంలో రాహుల్ కాస్త భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఓ వైపు సైకిల్ సవారీ,ఎడ్లబండిపై ప్రచారం చేస్తు ముందుకు వెళుతున్నారు.
కర్ణాటకలోని కోలార్‌లో పర్యటించిన రాహుల్… దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా రాహుల్ సైకిల్ తొక్కి తన నిరసన వ్యక్తం చేశారు. తర్వాత చమురు ధరల పెంపునకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో ఎద్దుల బండి ఎక్కి కొద్ది దూరం ప్రయాణం చేశారు.
కోలార్ రోడ్ షోలో ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.మొబైల్ ఫోన్‌లో మూడు మోడ్స్ ఉంటాయి. వర్క్ మోడ్, స్పీకర్ మోడ్, ఎయిరోప్లేన్ మోడ్. ప్రధాని మోడీ కేవలం స్పీకర్ మోడ్, ఎయిర్‌ప్లేన్ మోడ్‌లు మాత్రమే ఉపయోగిస్తారు. వర్క్ మోడ్‌ను ఎప్పటికీ ఉపయోగించరు అంటూ ఎద్దేవా చేశారు. పెట్రోల్ ధరలను ప్రభుత్వం నియంత్రించలేకపోతోందని…సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మే 12న ఎన్నికలు జరగనుండగా…. మే 15న ఫలితాలు వెలువడనున్నాయి.