ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ని వీడి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా, పంజాబ్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం ఆయన ఇతర ఎంపీలతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి, పంజాబ్ ప్రభుత్వం అనుసరిస్తున్న ‘ప్రతీకార రాజకీయాల’ గురించి ఫిర్యాదు చేశారు.
రాష్ట్రపతితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన రాఘవ్ చద్దా, “ఆప్ నుండి విడిపోయి బీజేపీలో చేరిన ఏడుగురు ఎంపీలపై పంజాబ్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఇప్పటికే పలువురిపై అక్రమ కేసులు పెట్టారు, నా సమాచారం ప్రకారం వాళ్ల తదుపరి లక్ష్యం నేనే” అని వ్యాఖ్యానించారు. పంజాబ్ పోలీస్, విజిలెన్స్ బ్యూరో మరియు కాలుష్య నియంత్రణ మండలి వంటి ప్రభుత్వ విభాగాలను రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
ఎంపీ సందీప్ పాఠక్ పై నాన్-బైలబుల్ సెక్షన్ల కింద తప్పుడు కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్త, ఎంపీ రాజేంద్ర గుప్తా ఫ్యాక్టరీ నీటి కనెక్షన్ కట్ చేయడమే కాకుండా దాడులు చేయించారని ఆరోపించారు. మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఇంటి బయట ‘దేశద్రోహి’ అని రాయించారని విమర్శించారు. ఎంపీల భద్రత మరియు రాజ్యాంగ పరమైన హక్కులను కాపాడతామని రాష్ట్రపతి తమకు హామీ ఇచ్చారని రాఘవ్ చద్దా తెలిపారు.
పంజాబ్ ప్రభుత్వ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. “ఆప్ ప్రభుత్వానికి ఇంకా కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది, కాబట్టి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అక్రమాలకు పాల్పడకండి” అని హెచ్చరించారు. ఏప్రిల్ 2026లో రాఘవ్ చద్ధాతో పాటు మొత్తం ఏడుగురు ఎంపీలు ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో విలీనమయ్యారు. ఈ పరిణామంతో పంజాబ్ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా ఇదే రోజు రాష్ట్రపతిని కలిసి, ఎంపీల ఫిరాయింపును అప్రజాస్వామికంగా పరిగణించాలని కోరారు.
Also Read:గోదారి గట్టుపైన..ఎంజాయ్ చేస్తారు!

