తెలంగాణ చీఫ్‌ జస్టిస్‌గా టీబీ రాధాకృష్ణన్..

243
kcr radhakrishnan
- Advertisement -

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీ రాధాకృష్ణన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ప్రవీణ్‌కుమార్ నియమితులయ్యారు. జస్టిస్ ప్రవీణ్‌కుమార్ జనవరి 1వ తేదీ నుంచి విధులు నిర్వర్తించనున్నారు.

దీంతో పాటు జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ వి. రామసుబ్రమణియన్‌ను తెలంగాణ హైకోర్టుకు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 13కు చేరింది. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు కేటాయించడంపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ చొరవతోనే ప్రత్యేక హైకోర్టు సాధ్యమైందన్నారు. అన్నివర్గాల ప్రజలకు సత్వర న్యాయం జరిగేలా దొహద పడుతుందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు న్యాయవాదులు.

టీఆర్ఎస్‌ ఎంపీల పోరాటంతో ఎట్టకేలకు ఉమ్మడి హైకోర్టును విభజిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోగా రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ బుధవారం సాయంత్రం నోటిఫికేషన్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి కేంద్రంగా విడి హైకోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్న రాష్ట్రపతి జనవరి 1వ తేదీ నుంచి ఆ రాష్ట్ర హైకోర్టు లావాదేవీలు అక్కడి నుంచే నడుస్తాయని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు 16 మంది న్యాయమూర్తులను, తెలంగాణకు పది మంది న్యాయమూర్తులను కేటాయిస్తున్నట్లు ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

- Advertisement -