తెలంగాణ ముద్దు బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కాంస్య విగ్రహాన్ని నిర్మల్ పట్టణంలో ప్రతిష్టించాలని నిర్ణయం తీసుకున్నామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలోని శాంతినగర్ క్రాస్ రోడ్ వద్ద పీవీ విగ్రహ ఏర్పాటు స్థలాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశ ప్రజలకు పీవీ ఎంతో సేవ చేశారని పేర్కొన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టిన వ్యక్తి పీవీ అని కొనియాడారు. రాజనీతివేత్త పీవీని గత ప్రభుత్వాలు విస్మరించాయని, సీఎం కేసీఆర్ ప్రభుత్వం అధికారికంగా పీవీ జయంతి వేడుకలు నిర్వహించిందని పేర్కొన్నారు. పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ కేశవరావు, ఎమ్మెల్సీ వాణిదేవి, తదితరులను విగ్రహా ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానించనున్నట్లు మంత్రి చెప్పారు.