భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు చరిత్ర సృష్టించింది. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ టైటిల్ విజేతగా నిలిచింది. ఫైనల్లో రెండో సీడ్ ఒకుహర(జపాన్)పై సింధు అద్భుత పోరాటంతో విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన పోరులో గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. 21-19, 21-17 తేడాతో వరుస సెట్లలో గెలిచి ప్రత్యర్థిని మట్టికరిపించింది. ఈ ఏడాది సింగిల్స్‌లో సింధు ఖాతాలో తొలి టైటిల్ ఇదే కావడం విశేషం. వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో విజేతగా నిలిచిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది సింధు.
గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో సింధు, ఒకుహర మధ్య జరిగిన మారథాన్ పోరు మరచిపోలేనిది. బ్యాడ్మింటన్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘంగా 110 నిమిషాల పాటు సాగిన చిరస్మరణీయ పోరులో ఒకుహర విజేతగా నిలిచినా.. సింధు చూపిన అసాధారణ పోరాటం అందరినీ ఆకట్టుకుంది. ఈ సంవత్సరం చైనాలో జరుగుతున్న వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో మళ్లీ అనుకోకుండా ఆ ఇద్దరే ఫైనల్స్‌లో పోటీపడ్డారు.