ఆసియా క్రీడల్లో భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడల చరిత్రలో ఫైనల్ చేరిన తొలి భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణీగా సింధు నిలిచింది. ఇప్పటి వరకూ ఆసియా క్రీడల్లో మహిళల, పురుషుల సింగిల్స్‌లో ఫైనల్ చేరిన వారు లేరు. ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ చరిత్రలో భారత్‌కు ఇప్పటి వరకూ ఒకే ఒక్క సింగిల్స్ పతకం ఉంది. 1982లో దిల్లీలో నిర్వహించిన ఆసియా క్రీడల్లో పురుషుల సింగిల్స్‌లో సయ్యద్ మోదీ కాంస్యం గెలిచాడు. ఆ తర్వాత సింగిల్స్‌లో భారత్‌కు ఒక్క పతకం కూడా రాలేదు.
ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న 18వ ఆసియా క్రీడల్లో మహిళల సింగిల్స్‌లో భారత్‌కు నిన్ననే రెండు పతకాలు ఖాయమయ్యాయి. అయితే తొలి సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్(చైనీస్ తైపీ) చేతిలో ఓడిన సైనా కాంస్యంతో సరిపెట్టుకుంది. ఆ తర్వాత జరిగిన రెండో సెమీఫైనల్లో పీవీ సింధు.. ప్రపంచ నం.2 అకానె యమగూచి(జపాన్) పై ఘన విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా సాగింది.
క్వార్టర్స్‌లోలాగే సెమీస్‌లో కూడా సింధు గెలవడానికి చెమటోడ్చాల్సి వచ్చింది. తొలి గేమ్‌ను కష్టమ్మీద 21-17తో గెలిచి లీడ్‌లోకి దూసుకెళ్లిన సింధు.. రెండో గేమ్‌లో మళ్లీ తడబడింది. 15-21 తో యమగుచి ఆ గేమ్‌ను గెలిచి మ్యాచ్‌ను సమం చేసింది. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సింధు మరోసారి దూకుడుగా ఆడింది. ఈసారి ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 21-10 తేడాతో సునాయాసంగా ఆ గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కూడా గెలిచింది. ఇప్పుడు ఫైనల్లో ఓడినా కనీసం సిల్వర్ మెడల్ సింధు సొంతమవుతుంది. గెలిస్తే మాత్రం కొత్త చరిత్రే సృష్టిస్తుంది. మంగళవారం ఫైనల్ పోరు జరగనుంది.