ఫైనల్‌కు చేరిన పీవీ సింధు..

490
PV Sindhu beats Ratchanok Intanon to enter final
- Advertisement -

పీవీ సింధు హంకాంగ్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో జోరు కొనసాగించింది. అదిరే ప్రదర్శనతో ఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో సింధు 21-17, 21-17తో ప్రపంచ నంబర్‌-6 రచనోక్‌ను ఓడించింది. ఈ టోర్నీలో ఫైనల్‌ చేరడం సింధుకు ఇది వరుసగా రెండోసారి. ఫైనల్లో ఆమె ప్రపంచ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ)ను ఢీకొంటుంది. ఫైనల్లో గెలిస్తే.. సైనా నెహ్వాల్‌, ప్రకాశ్‌ పదుకొనె తర్వాత హాంకాంగ్‌ ఓపెన్‌ గెలిచిన మూడో భారత ప్లేయర్‌గా సింధు ఘనత సాధిస్తుంది.

ఈ సెమీస్‌ పోరుకు ముందు రచనోక్‌ (థాయ్‌లాండ్‌)పై సింధు రికార్డు అంత గొప్పగా లేదు. ఆమెతో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక్కటే నెగ్గింది. కానీ ఈసారి సింధు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తనదైన శైలిలో ఎదురుదాడికి దిగిన సింధు.. ప్రత్యర్థి స్ట్రోక్‌లను చక్కని డిఫెన్స్‌తో ఎదుర్కొంది. తొలి గేమ్‌ ఆరంభంలో సింధు 6-2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రచనోక్‌ కొన్ని మంచి స్ట్రోక్‌లు ఆడినా.. సింధు ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఓ కళ్లు చెదిరే క్రాస్‌ కోర్టు స్మాష్‌తో 11-7 ఆధిక్యంలోకి వెళ్లిన సింధు.. అదే దూకుడుతో 17-9తో నిలిచింది. రచనోక్‌ కొన్ని చక్కని షాట్లతో బలంగా పుంజుకున్నా అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగింది. రచనోక్‌ ఆడిన ఓ బ్యాక్‌హ్యాండ్‌ నెట్‌కు తగలడంతో తొలి గేమ్‌ సింధు సొంతమైంది.

PV Sindhu beats Ratchanok Intanon to enter final

రెండో గేమ్‌ ఆరంభంలో రచనోక్‌ 3-1తో ఆధిక్యం సాధించింది. పుంజుకున్న సింధు 5-4తో ఆధిక్యం సంపాదించింది. రచనోక్‌ బ్యాక్‌హ్యాండ్‌ రిటర్న్‌ బయటికి వెళ్లినప్పుడు స్కోరు 6-6తో సమమైంది. ఆ తర్వాత కూడా ఆమె తప్పులు కొనసాగించింది. సింధు 10-6తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. విరామం తర్వాత రచనోక్‌ పుంజుకుంది. చక్కని ప్లేస్‌మెంట్స్‌ వేసిన ఆమె 12-13తో నిలిచింది. ఐతే శరీరంపైకి ఓ స్మాష్‌, ఓ చక్కని రిటర్న్‌తో సింధు 16-13 ఆధిక్యం సంపాదించింది. అదే జోరుతో 18-14కు చేరుకుంది. ఆ తర్వాత రచనోక్‌ గట్టిగానే ప్రయత్నించినా సింధు గేమ్‌ గెలవకుండా అడ్డుకోలేకపోయింది. మరో సెమీఫైనల్లో తై జు యింగ్‌ 21-9, 18-21, 21-7తో దక్షిణ కొరియాకు చెందిన జి హ్యున్‌ సంగ్‌పై విజయం సాధించింది. ఈ టోర్నీలో నిరుడు కూడా సింధు, తై జు మధ్యే ఫైనల్‌ జరిగింది. సింధు ఓడిపోయింది.

- Advertisement -