ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై శనివారం తెల్లవారుజామున రష్యా భారీ దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో కనీసం ఒకరు మృతి చెందగా, మరో 27 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. మాస్కో వరుసగా బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు నిర్వహించింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శనివారం ఉక్రెయిన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. శాంతి చర్చల ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే ‘ప్రత్యేక సైనిక ఆపరేషన్’ను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఉన్నత స్థాయి చర్చలు జరపనున్న నేపథ్యంలో వెలువడ్డాయి. ఈ యుద్ధం నాలుగో సంవత్సరానికి చేరువవుతోంది.
ఉక్రెయిన్ శాంతియుతంగా ఈ వివాదాన్ని పరిష్కరించాలనుకోవడం లేదని మాస్కో భావిస్తోందని పుతిన్ తెలిపారు. దౌత్య ప్రయత్నాలు ఫలించకపోతే సైనిక చర్యలపై ఆలోచిస్తున్నామని అన్నారు. “కీవ్ అధికారులు శాంతియుత పరిష్కారానికి ముందుకు రాకపోతే, మా ముందున్న అన్ని లక్ష్యాలను సైనిక మార్గంలోనే సాధిస్తాం” అని రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ టాస్ పుతిన్ వ్యాఖ్యలను ఉటంకించింది.
జెలెన్‌స్కీ–ట్రంప్ భేటీకి ఒక్కరోజు ముందు కీవ్‌పై రష్యా దాడులు జరగడం గమనార్హం. శనివారం ఉదయం పలుచోట్ల భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఈ దాడులు గంటల తరబడి కొనసాగాయి. బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో రష్యా వరుస దాడులు నిర్వహించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ వారాంతంలో ఫ్లోరిడాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలవనున్నట్లు తెలిపారు. యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ భద్రతకు సంబంధించిన భవిష్యత్ హామీలపై చర్చించనున్నట్లు చెప్పారు. ఆదివారం ఈ సమావేశం జరుగుతుందని శుక్రవారం మీడియాకు వెల్లడించారు.
యుద్ధానికి ముగింపు పలకేందుకు రూపొందించిన 20 అంశాల ప్రణాళికను ఈ భేటీలో సమీక్షించనున్నట్లు జెలెన్‌స్కీ తెలిపారు. ఆ ప్రణాళిక దాదాపు పూర్తైందని, చాలా అంశాలపై ఇప్పటికే అంగీకారం కుదిరిందన్నారు. యూరోపియన్ దేశాలు కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఉక్రెయిన్ కోరుకుంటోందని, అయితే తక్కువ సమయంలో వారిని చేర్చడం కష్టమని చెప్పారు.
ఇటీవల జెలెన్‌స్కీ యుద్ధానికి ముగింపు పలకేందుకు కొన్ని రాజీలకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని చెప్పారు. తూర్పు పారిశ్రామిక ప్రాంతంలోని కొన్ని భాగాల నుంచి ఉక్రెయిన్ సైన్యం వెనక్కు తగ్గేందుకు సిద్ధమని, అదే విధంగా రష్యా కూడా వెనక్కు తగ్గితే ఆ ప్రాంతాన్ని అంతర్జాతీయ శాంతి దళాల పర్యవేక్షణలో డిమిలిటరైజ్డ్ జోన్‌గా మార్చవచ్చని ఆయన వెల్లడించారు.
Also Read:అంతర్జాతీయ ఇన్నోవేషన్ సమ్మిట్‌కు కేటీఆర్

