అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న చిత్రం ‘పుష్ప’. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా డిసెంబర్ 17న విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈమూవీ టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకొని ప్రమోషన్స్ జోరు పెంచింది. అందులో భాగంగా ‘పుష్ప’ అల్లు అర్జున్ ప్రమోషన్స్ కోసం చెన్నైకి వెళ్లాడు. చెన్నైలో ఈ రోజు ప్రెస్ మీట్లో బన్నీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ప్రసంగం తమిళంలోనే సాగింది.
తన చిత్రాలు బాలీవుడ్ లోనూ డబ్ అవుతుంటాయని, అయితే తనకు తమిళనాడులో మంచి నటుడిగా గుర్తింపు పొందాలన్నది ఓ కోరిక అని తెలిపారు. తన సినిమాలు తమిళనాడులోనూ విజయం సాధించాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. పుష్ప చిత్రంతో తన ఆకాంక్ష నెరవేరుతుందని భావిస్తున్నానని, ఈ సినిమా పాటలు తమిళనాడు ప్రజలను బాగా ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. తన ఫ్రెండ్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన పాటలు ఇచ్చారని, అందుకే ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు.
ఇక, “మీరు మంచి డ్యాన్సర్ కదా, తమిళంలో మీకు నచ్చిన డ్యాన్సర్ ఎవరు?” అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, బన్నీ సమాధానమిచ్చారు. మునుపటి తరంలో కమల్ హాసన్ సర్ అద్భుతమైన డ్యాన్సర్ అని కొనియాడారు. ఆ తర్వాతి తరంలో విజయ్, ఇప్పటి జనరేషన్ లో ధనుష్, శింబు, ఇతర యువ హీరోలంతా మంచి డ్యాన్సర్లేనని పేర్కొన్నారు. తాను తమిళ సినిమాలు కూడా చూస్తుంటానని తెలిపారు. ఇటీవల శివకార్తికేయన్ నటించిన ‘డాక్టర్’ చిత్రాన్ని చూశానని, బాగా నచ్చిందని వెల్లడించారు.
కాగా, మరో మూడు రోజుల్లో సినిమా విడుదల కాబోతోంది. పుష్పరాజ్ అనే ఎర్రచందన స్మగ్లర్‌గా అల్లు అర్జున్ చేయబోయే సూపర్ పెర్ఫార్మెన్స్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సింగిల్స్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి.