భార్యభర్తలు ఇద్దరూ కానిస్టేబుళ్లే. మంచి జీతం..జీవితం హాయిగా ఉంది.. అయినా ఏదో వెలితి.. పేరు, ప్రతిష్టలు కోసం ఏదైనా చేయాలనుకున్నారు.. అందుకోసం ఎవరెస్ట్ ఎక్కి చరిత్రలో ఆదర్శ దంపతులుగా నిలిచిపోవాలనుకున్నారు. మరీ ఎవరెస్ట్ ఎక్కడమంటే మాటలా.. చాలా కష్టపడాలి.. కొన్ని నెలలు కఠిన శిక్షణ తీసుకోవాలి.. అయితే ఇవేవి ఈ దంపతులకు అవసరం రాలేదు.. ఎందుకంటే ఎలాంటి కష్టం లేకుండా టెక్నాలజీతో ఎవరెస్ట్ పైకి ఎక్కారు. టెక్నాలజీతో ఎవరెస్ట్ ఎలా ఎక్కారంటే.. ఫోటో మార్ఫింగ్ చేసి తమను తాము ఎవరెస్ట్ ఎక్కినట్లు ప్రకటించుకున్నారు. 2016 మేలో తాము ఎవరెస్టు ఎక్కినట్లు పేర్కొంటూ అందుకు సంబంధించిన ఫొటోలను వారు సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.
ఆ దంపతులుదినేశ్ రాఠోడ్, టర్కేశ్వరి రాఠోడ్ తాము మౌంట్ ఎవరెస్టు ఎక్కామని.. ఆ ఘనత సాధించిన తొలి భారతీయ దంపతులు తామేనని ప్రకటించుకున్నారు. అయితే నిజం భయటపడడంతో ఈ దంపతులు ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కలేదని పలువురి నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ప్రాథమిక విచారణలో దినేశ్ దంపతులు.. ఇతరుల ఫొటోలను మార్ఫింగ్ చేసి తాము శిఖరాన్ని అధిరోహించినట్లు ప్రకటించుకున్నట్లు తేలింది. దీంతో పుణె పోలీసు శాఖ వారిపై 2016 నవంబరులో సస్పెన్షన్ విధించింది.
ఇప్పుడు తాజాగా ఆ జంటను ఏకంగా విధుల నుంచి వెలివేస్తున్నట్లు అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సహిబ్రాయో పాటిల్ వెల్లడించారు. నిజానికి ఈ ఇద్దర్ని గత ఆగస్టులో నేపాల్ ప్రభుత్వం పదేళ్ల పాటు బ్యాన్ చేసింది. తాము ఎవరెస్ట్ ఎక్కినట్లు చెప్పుకున్న కానిస్టేబుళ్ల జంట గురించి నేపాల్‌లోనూ మహారాష్ట్ర పోలీసులు ఆరాతీశారు. అయితే అక్కడ పర్వతారోహకులు అసలు ఈ జంటనే చూడలేదన్నారు. దీంతో ఆ జంట తప్పుడు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు అర్థం చేసుకున్నారు. ఫోటోలను మార్పింగ్ చేసి తప్పుదోవ పట్టించిన జంటను పోలీస్‌శాఖ నుంచి డిస్మిస్ చేస్తున్నట్లు పుణె ఎసీసీ తెలిపారు.