ఐపీఎల్‌లో సొంతగడ్డపై వరుసగా 5 విజయాలు నమోదు చేసిన వార్నర్ సేనకు ఆరో మ్యాచ్‌లో చుక్కెదురైంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో పుణె 12 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ను ఓడించింది. మొదట పుణె 20 ఓవర్లలో 8 వికెట్లకు 148 పరుగులు చేసింది. అనంతరం ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ఉనద్కత్ (5/30) చివరి రెండు ఓవర్లలో సంచలన బౌలింగ్‌తో సన్‌రైజర్స్‌ను దెబ్బ తీశాడు. ఆ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 136 పరుగులే చేయగలిగింది.
149 పరుగులు.. వార్నర్, ధావన్, యువరాజ్‌ల ఫామ్ చూసుకుంటే అదో పెద్ద లక్ష్యమే కాదు. ఛేదనలో ఓపెనర్ ధవన్ (19) వెంటవెంటనే రెండు ఫోర్లు, సిక్సర్ బాదడంతో రైజర్స్ మూడు ఓవర్లలోనే 23 పరుగులు చేసింది. అయితే, ఐదో ఓవర్లో బౌలింగ్‌కు దిగిన బెన్ స్టోక్స్.. ధవన్‌తో పాటు కేన్ విలియమ్సన్ (4)ను అవుట్ చేసి ఆతిథ్య జట్టుకు షాకిచ్చాడు. సుందర్ బౌలింగ్‌లో కెప్టెన్ డేవిడ్ వార్నర్ మూడు ఫోర్లతో రెచ్చిపోయాడు. యువరాజ్ కూడా తన మార్కు షాట్లతో జోరు పెంచడంతో 12 ఓవర్లకు 83/2 స్కోరుతో నిలిచిన సన్‌రైజర్స్ సునాయాసంగా లక్ష్యాన్ని చేరుకునేలా కనిపించింది. అయితే.. 13వ ఓవర్లో వార్నర్‌ను అవుట్ చేసిన స్టోక్స్ 54 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యాన్ని విడదీశాడు. తర్వాతి ఓవర్లో హెన్రిక్స్ (4)ను పెవిలియన్ చేర్చిన తాహిర్ 2 పరుగులే ఇవ్వడంతో పుణె రేసులోకొచ్చింది. నమన్ ఓఝా (9) ఇబ్బంది పడుతున్నా.. యువీ వెంటవెంటనే ఫోర్, సిక్సర్ సాధించి ఊపు మీద కనిపించడంతో హైదరాబాద్ శిబిరం నిశ్చింతగా ఉంది. కానీ, 18వ ఓవర్లో యువీ, నమన్‌ను అవుట్ చేసి ఉనాద్కట్ షాకిచ్చాడు. దాంతో, సమీకరణం 12 బంతుల్లో 22 రన్స్‌గా మారింది. స్టోక్స్ వేసిన 19వ ఓవర్లో 9 పరుగులే వచ్చాయి. ఆఖరి ఓవర్లో ఒక్క పరుగైనా ఇవ్వని ఉనాద్కట్ వరుస బంతుల్లో బిపుల్ శర్మ (8), రషీద్ (3), భువనేశ్వర్ (0)లను అవుట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేసి పుణెను గెలిపించాడు.
అంతకుముందు పుణెను సన్‌రైజర్స్ బౌలర్లు కట్టడి చేశారు. రాహుల్ త్రిపాఠి (1)ని రెండో ఓవర్లోనే బిపుల్‌శర్మ రనౌట్ చేశాడు. స్మిత్ జిడ్డు బ్యాటింగ్‌తో విసిగించాడు. 39 బంతులాడిన స్మిత్ ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు. పవర్ ప్లేలో 35 పరుగులకే పరిమితమైన పుణె.. ఆ తర్వాతి ఓవర్లోనే రహానె (22) వికెట్ కోల్పోయింది. స్మిత్, స్టోక్స్ (39) నెమ్మదిగా ఆడటంతో 10 ఓవర్లకు పుణె 51 పరుగులే చేయగలిగింది. ఈ దశలో స్టోక్స్ … బిపుల్ వేసిన 11వ ఓవర్లో 2 సిక్సర్లు బాదాడు. బిపుల్ తర్వాతి ఓవర్లోనూ మరో సిక్సర్ బాదిన స్టోక్స్.. 14వ ఓవర్లో ఫోర్ కొట్టాడు. పుణె ఇన్నింగ్స్‌లో అదే తొలి ఫోర్. 6 పరుగుల తేడాలో స్టోక్స్, స్మిత్, క్రిస్టియన్ (4) ఔటవడంతో కథ మొదటికొచ్చింది. ఐతే మొదట్లో ఇబ్బందిపడ్డ ధోని (31; 21 బంతుల్లో 2×4, 2×6).. 19వ ఓవర్లో (భువనేశ్వర్) ఫోర్, 2 సిక్సర్లతో 19 పరుగులు రాబట్టడంతో పుణె మెరుగైన స్కోరు సాధించింది.
ప్రస్తుతం 13 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ ప్లేఆఫ్‌కు చేరాలంటే తర్వాతి 2 మ్యాచ్‌ల్లో నెగ్గాల్సిందే! దీంతో పాటు మిగతా మ్యాచ్‌ల ఫలితాలూ కీలకమే. ఇక ఈ గెలుపుతో రెండో స్థానానికి దూసుకెళ్ళిన పుణె (16)కు ప్లేఆఫ్ బెర్తు ఖాయమవ్వాలంటే మరొక్క విజయం చాలు.