ఢిల్లీ అసెంబ్లీలో ఈ రోజు అలజడి చెలరేగింది. ఆప్ బహిష్కృత నేత, ఎమ్మెల్యే కపిల్ మిశ్రాపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో దాడి చేశారు. జీఎస్టీ బిల్లును ఆమోదించేందుకు బుధవారం (మే31) ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మిశ్రా సభకు వచ్చారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్ ను కోరారు. సీఎం కేజ్రీవాల్ అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దీంతో సభ రచ్చ రచ్చగా మారింది.
దాంతో ఏకంగా శాసనసభలోనే అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీకి చెందిన తిరుగుబాటు దారుడు, ఎమ్మెల్యే కపిల్ మిశ్రాపై దాడికి దిగారు. ఈ రోజు కపిల్ మిశ్రా తమ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై పలు అవినీతి ఆరోపణలు చేశారు. సీఎంతో పాటు ఆరోగ్య శాఖమంత్రి సత్యేంద్ర జైన్ అవినీతి వ్యవహారం అంటూ ఆయన ఏదో చెప్పబోయారు. దీంతో హైడ్రామా కొనసాగింది. వెంటనే లేచిన ఆప్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. అనంతరం కపిల్ మిశ్రాపై ఐదుగురు ఆప్ ఎమ్మెల్యేలు దాడి చేశారు.
అధికార ఆప్ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా కపిల్ మిశ్రాపై పిడిగుద్దుడంతో.. కపిల్ పై దాడిని అడ్డుకునేందుకు ఇతర ప్రతిపక్ష నేతలు ప్రయత్నించగా వారికీ ఆప్ సభ్యుల మధ్య తోపులాట జరిగింది. అసెంబ్లీ హాల్ నుంచి ఎమ్మెల్యే మిశ్రాను మార్షల్స్ బయటకు లాక్కెళ్లారు. బయటకు వచ్చిన కపిల్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ కేజ్రీవాల్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
రామ్ లీలా మైదానంలో ప్రత్యేక చర్చ జరగాలని డిమాండ్ చేశానని.. దీంతో ఆప్ సభ్యులు దాడి చేసినట్లు చెప్పారు మిశ్రా. తనపై దాడి జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో ఉన్న కేజ్రీవాల్ నవ్వుతున్నారని తెలిపారు. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సూచనల మేరకే నాపై దాడి చేశారని కపిల్ మిశ్రా ఆరోపించారు. అంతేకాకుండా కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ కలిసి రూ.300 కోట్ల మెడిసిన్స్ స్కామ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. ఇదిలా ఉండగా కేజ్రీవాల్‌పై అవినీతి ఆరోపణలు చేసిన మిశ్రాను.. ఇటీవలే మంత్రి పదవి నుంచి కూడా తొలిగించిన విషయం తెలిసిందే.