తెలంగాణ బతుకమ్మకు మరో అరుదైన గౌరవం. దేశ చరిత్రలో తొలిసారిగా 316 మంది కవయిత్రుల కవితా గానం మరియు “పూల సింగిడి” కవితా సంకలనం ఆవిష్కరణ జరిగింది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నేడు రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల మరియు దేశాల నుండి వచ్చిన కవయిత్రులు బతుకమ్మపై తమ కవితలను వినిపించారు. ఏక కాలంలో రవీంద్రభారతిలోని మూడు హాల్లలో ఈ కవి సమ్మేళనం జరిగింది.
ప్రారంభ సమావేశంలో అల్ ఇండియా రేడియో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శైలజ సుమన్, ప్రముఖ రచయిత్రులు చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మ, తిరునగరి జానకీదేవి, సామాజిక కార్యకర్త, కవయిత్రి సిస్టర్ నివేదితలు ఆవిష్కరణలో పాల్ఘొనగా ఆవిష్కరణ తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం నాయకురాలు, ప్రముఖ కవయిత్రి జ్వలిత సభాధ్యక్షత వహించారు. భారదేశ చరిత్రలోనే ఇంత ఎక్కువమంది కవయిత్రులతో కవిసమ్మేళనం జరగలేదని, ఇంతపెద్ద కవయిత్రుల కవితా సంకలనం కూడా రాలేదని వక్తలు అన్నారు. ఈ గౌరవం మన బతుకమ్మకు దక్కడం హర్షనీయమన్నారు.
5 రాష్ట్రాల నుండే కాక వివిధ దేశాల నుండి కవయిత్రుల కవితలు ఈ సకలనంలో ఉన్నాయి. ఈ కవితా సంకలనానికి సంపాదకులుగా ఐనంపూడి శ్రీలక్ష్మి, జ్వలిత, సరోజా వింజామర, అరుణ నారదభట్ల వ్యవహరించారు.