భారత రాష్ట్రపతి శీతాకాల విడిది కేంద్రం బొల్లారం అతిధి గృహం సందర్శకులతో కిటకిట లాడుతోంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సూచనల మేరకు అటవీ శాఖ భారీ ఎత్తున పచ్చదనం చేపట్టింది. కొత్తగా వేలాది మొక్కలు నాటడంతో పాటు రాక్ గార్డెన్, బటర్ ఫ్లై పార్క్, అరుదైన జాతి మొక్కలతో వనాలను అటవీ శాఖ అభివృద్ది పరిచింది. రాష్ట్రపతి పర్యటన ముగిసిన తర్వాత అనవాయితీగా ప్రజలకు బొల్లారం సందర్శన కోసం అధికారులు తెరిచి ఉంచారు.
ఈ నెల ఆరుదాకా ఎవరైనా సరే రాష్ట్రపతి అతిధి గృహంతో పాటు అక్కడి పార్కులను సందర్శించవచ్చు. కొత్త సంవత్సర ఆరంభం జనవరి ఒకటి ఒక్కరోజే పదివేలకు మందికి పైగా పర్యాటకులు వచ్చినట్లు, ఇది రికార్డు అని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో, స్కూలు విద్యార్థుల్లో పర్యావరణంపై అవగాహన పెరిగేలా అటవీ శాఖ చక్కని ప్రయత్నాలు చేసిందని సందర్శకులు అభినందిస్తున్నారు.