తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగం అంచెలచెలుగా ముందు దూసుకుపోతోంది.. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన నాటి నుంచి చూసుకుంటే ఈ రంగంలో తెలంగాణ ప్రతిఏటా ఎంతో వృద్ధిని నమోదు చేస్తూ సాగుతోంది. ఏ ఒక్క ఏడాదిలోనూ ఐటీ రంగంలో తెలంగాణ తిరోగమన దిశలో సాగలేదు. ఈ మేరకు 2014 నుంచి ఈ ఏడాది వరకు ఐటీ రంగంలో తెలంగాణ సాధించిన వృద్ధిని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ట్వీట్టర్లో ఓ పోస్ట్ షేర్ చేశారు.
2014 నుంచి ఏడేళ్ల ప్రగతి ఒక ఎత్తైతే…గడచిన ఏడాదిలో ఈ రంగంలో తెలంగాణ ఉత్తమ ప్రగతిని సాధించిందని కేటీఆర్ తెలిపారు. గతేడాదిలో ఐటీ ఎగుమతుల్లో 26.14 శాతం వృద్ధిని నమోదు చేసిన తెలంగాణ… ఉపాధిలో 23.48 శాతం వృద్ధిని నమోదు చేసిందని ఆయన తెలిపారు. ఎగుమతుల్లో గడచిన 8 ఏళ్లలో ఏకంగా మూడు రెట్లకు మించి వృద్ధి నమోదైందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ గణాంకాలు తెలుపుతున్న ఓ డయాగ్రమ్‌ను కూడా కేటీఆర్ తన ట్వీట్‌కు యాడ్ చేశారు.