వివాదాస్పద సినిమాలతో ఎప్పుడు హాట్ టాపిక్ గా మారే రామ్ గోపాల్ వర్మ చిత్రం మరోసారి వార్తలో నిలిచింది. శుక్రవారం రిలీజైన వంగవీటి సినిమాపై పలు అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. వంగవీటి రంగా జీవిత కథను బెస్ చేసుకుని..బెజవాడ రౌడీ ఇజం నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాలో పలు సన్నివేశాలు కాపుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయంటూ వంగవీటి రంగా అభిమానుల సంఘం శనివారం మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. వెంటనే ఆ సన్నివేశాలను తొలగించాలని రంగా అభిమానుల సంఘం హెచ్ఆర్ సీ కి ఫిర్యాదు చేసింది. విజయవాడ సర్కిల్ లోని ఓ థియేటర్ ముందు నిరసన తెలిపి చిత్ర ప్రదర్శనను అడ్డుకున్నారు.
కాగా ‘వంగవీటి’ సినిమాపై మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నిన్న ఏపీ డీజీపీ సాంబశివరావుని కలిశారు. తాము చెప్పిన అభ్యంతరాలను రాంగోపాల్‌వర్మ పరిగణనలోకి తీసుకోలేదని, సినిమాలోని అభ్యంతరకర దృశ్యాలను వెంటనే తొలగించాలని రాధాకృష్ణ విజ్ఞప్తి చేశారు. చిత్రంపై కోర్టుకు కూడా వెళ్తానని వంగవీటి రాధ స్పష్టం చేశారు. కాగా, రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలని డీజీపీ సాంబశివరావు వంగవీటి రాధకు తెలిపారు.