పర్యావరణ పరిరక్షణలో ప్ర‌తి ఒక్క‌రూ భాగ‌స్వామం కావాలి: మంత్రి

25
Minister Indrakaran Reddy

యావ‌త్ ప్రపంచానికి పెను సవాలుగా మారిన వాతావరణ మార్పు పరిస్థితుల నుంచి భావితరాలనే కాకుండా ప్రస్తుత తరాన్ని రక్షించేందుకు ప్ర‌భుత్వ కృషితో పాటు ప్ర‌జ‌ల భాగ‌స్వాములు కావాల‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని భయపెడుతున్న వాతావరణ మార్పులపై ఇప్పుడు ఉన్న చ‌ట్టాలు మాత్ర‌మే స‌రిపోవని ప్ర‌జ‌లంతా ఒక్క‌టై క‌దలాల్సిన స‌మ‌య‌మిద‌న్నారు. ప్ర‌కృతితో మ‌మేక‌మై మన జీవన విలువలలో పర్యావరణ పరరక్షణను ఒక భాగంగా చేసుకోవలసిన అవసరం ఉందని ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. అభివృద్ది పేరుతో ప్ర‌కృతి సంప‌ద‌ను ద్వంసం చేయ‌డం, అడవుల్లోని చెట్లను విచక్షణ రహితంగా నరికేయడం వ‌ల్ల మాన‌వ మనుగ‌డ ప్ర‌శ్నార్ధ‌కంగా మారింద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మానవజాతి వల్ల ఎన్నడూ లేనంత స్థాయిలో విశ్వం అంతటా ప్రకృతి విధ్వంసానికి గురవుతోందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రపంచం తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అభిప్రాయ‌ప‌డ్డారు.

కరోనా విపత్తు మానవాళికి నేర్పిన గుణపాఠమ‌ని, భావి తరాల కోసం ప్రకృతి వనరుల పరిరక్షణ కోసం తక్షణమే ప్రపంచవ్యాప్తంగా కార్యాచరణ ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. సర్వ మానవాళి శ్రేయస్సు కోసం ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్షణ‌లో ప్ర‌తి ఒక్క‌రూ భాగ‌స్వాములై ప్ర‌కృతిని కాపాడాల‌ని కోరారు. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు వినూత్న‌మైన కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టి తెలంగాణ‌ను దిక్సూచిగా నిలిపారని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన‌ తెలంగాణకు హరితహారం కార్యక్రమం దేశవ్యాప్తంగా మార్గ‌ద‌ర్శ‌కంగా నిలుస్తుంద‌ని పేర్కొన్నారు. ఉద్య‌మ స్పూర్తితో మొక్క‌లు నాటి హ‌రిత‌హార కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని ఈ సంద‌ర్భంగా పిలుపునిచ్చారు. శనివారం ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్సవం సంద‌ర్భంగా కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి, ఇపీటీఆర్ఐ ఆద్వ‌ర్యంలో నిర్వ‌హించే వ‌ర్చువ‌ల్ వేడుకల్లో అటవీ, పర్యావరణ ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొని, ప్రసంగిస్తారు.