వరుసగా రెండో ఓటమి….

256
Pro Kabaddi League 2017: Telugu Titans vs Bengaluru Bulls
- Advertisement -

సొంతగడ్డపై తెలుగు టైటాన్స్‌కు మళ్లీ చుక్కెదురైంది. ఆరంభ మ్యాచ్‌లో విజయంతో జోరుమీద కనిపించిన టైటాన్స్‌.. వరుసగా రెండో ఓటమి చవిచూసింది. బెంగళూర్‌ బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ ఏకంగా పది పాయింట్ల భారీ తేడాతో ఓటమిపాలైంది.

బెంగళూర్‌ స్టార్‌ రైడర్‌ రోహిత్‌ కుమార్‌ చిల్లార్‌ చెలరేగిన వేళ.. ఆ జట్టు సాధికార విజయంతో లీగ్‌లో బోణీ కొట్టింది. తెలుగు టైటాన్స్‌ కెప్టెన్‌, స్టార్‌ రైడర్‌ రాహుల్‌ చౌదరి ప్రొ కబడ్డీ చరిత్రలో అరుదైన రికార్డు అందుకున్నాడు. బెంగళూర్‌తో మ్యాచ్‌లో ఓ రైడ్‌ పాయింట్‌ సాధించిన రాహుల్‌.. లీగ్‌లో 500 రైడ్‌ పాయింట్లు సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గత సీజన్‌లో ఓవరాల్‌ పాయింట్లు 500 దాటేసిన రాహుల్‌.. కేవలం రైడ్‌ పాయింట్లలోనే ఐదొందల మార్క్‌ అందుకున్నాడు. ప్రొ కబడ్డీలో నేడు విరామ రోజు. మంగళవారం మళ్లీ మ్యాచులు జరుగుతాయి.

రెచ్చిపోయిన రోహిత్‌ : తెలుగు టైటాన్స్‌ స్టార్‌ రైడర్‌ రాహుల్‌ చౌదరి మరోసారి విఫలమయ్యాడు. రాహుల్‌ వైఫల్యం ఫలితంపై ప్రభావం చూపింది. మొత్తం 14 సార్లు కూతకెళ్లిన రాహుల్‌.. కేవలం నాల్గు పాయింట్లు మాత్రమే తీసుకురాగలిగాడు. ఇదే సమయంలో బెంగళూర్‌ కెప్టెన్‌, స్టార్‌ రైడర్‌ రోహిత్‌ కుమార్‌ 10 రైడ్‌ పాయింట్లు సహా రెండు ట్యాకిల్‌ పాయింట్లతో అదరగొట్టాడు. దీంతో ఆరంభం నుంచే బెంగళూర్‌ ముందంజలో కొనసాగింది. ప్రథమార్థం ముగిసేసరికి 15-10తో ముందంజలో నిలిచిన బెంగళూర్‌.. ద్వితియార్థంలోనూ అదే జోరు చూపించింది. టైటాన్స్‌ రైడింగ్‌లోనూ, డిఫెన్స్‌లోనూ విఫలం కావటంతో పాయింట్లు రావటమే గగనమైంది. బెంగళూర్‌ జట్టులో అజరు కుమార్‌ 7 పాయింట్లు, మహేందర్‌ సింగ్‌ 3 పాయింట్లు, రవీందర్‌ పహల్‌ 3 పాయింట్లతో ఆకట్టుకున్నారు.

ముంబ, హర్యానా థ్రిల్లర్‌ :తొలుత జరిగిన యు ముంబ, హర్యానా స్టీలర్స్‌ మ్యాచ్‌ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఆఖరి రైడ్‌ వరకూ నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ మ్యాచ్‌లో యు ముంబ ఒక్క పాయింట్‌ తేడాతో గట్టెక్కింది. యు ముంబ స్టార్‌ రైడర్లు అనూప్‌ కుమార్‌, కాశీలింగ అడాకెలు మెరవటంతో కొత్త జట్టు హర్యానా స్టీలర్స్‌కు ఓటమి తప్పలేదు. వజీర్‌ సింగ్‌, వికాశ్‌ ఖండోలాలు రాణించటంతో ప్రతి దశలోనూ హర్యానా గట్టి పోటీనిచ్చింది.

5-3, 6-4, 7-5, 8-7తో ముందంజలో నిలిచిన యు ముంబ క్రమంగా ఆధిక్యం కోల్పోయింది. హర్యానా వరుస పాయింట్లతో విరామ సమయానికి 15-10తో ముందంజలో నిలిచింది. ఇరు వైపులా డిఫెన్స్‌ బలంగా ఉండటంతో ప్రతీసారి చావోరేవో రైడ్‌లోనే తేల్చుకోవాల్సి వచ్చింది. కాశీలింగ సూపర్‌రైడ్‌తో మూడు పాయింట్లు సాధించగా, అనూప్‌ కుమార్‌ సైతం సూపర్‌రైడ్‌తో హర్యానాను ఆలౌట్‌ చేశాడు. దీంతో యు ముంబ ద్వితియార్థంలో తొలిసారి 22-20తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆఖరు నిమిషంలో వజీర్‌ సింగ్‌ రెండు పాయింట్లు తీసుకొచ్చి 28-29తో మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చగా.. చివరి రైడ్‌ను చాకచక్యంగా ముగించిన అనూప్‌ కుమార్‌ ఒక్క పాయింట్‌ విజయాన్ని అందించాడు. తొలి మ్యాచ్‌లో పుణె చేతిలో ఓడిన యు ముంబ.. రెండో మ్యాచ్‌లో గెలుపొందింది. ఈ సీజన్‌తోనే ప్రొ కబడ్డీలోకిక అడుగుపెట్టిన హర్యానా స్టీలర్స్‌.. ఆరంభ మ్యాచ్‌లోనే తడబడింది.

- Advertisement -