ప్రియాంక న్యూ స్ట్రాటజీ.. దేశ చరిత్రలో తొలిసారి!

273
priyanka

లోక్ సభ ఎన్నికల ప్రచార పర్వాన్ని మోడీ ఇలాఖా వారణాసి నుండి ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొత్త స్ట్రాటజీని ఎంచుకున్నారు. నేటి నుండి మూడు రోజులపాటు ప్రయాగరాజ్ టు వారణాసి 140 కిలోమీటర్ల దూరం గంగా ప్రచార యాత్ర చేపట్టారు.

పవిత్ర గంగా నదిలో బోటులో ప్రయాణిస్తూ నదీ తీర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు ప్రియాంక. 140 కిలోమీటర్ల దూరం నదిలో ప్రియాంక పర్యటనలో కాంగ్రెస్ నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొననున్నారు. ప్రియాంక గంగా ప్రచారయాత్ర చర్చనీయాంశంగా మారింది. దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఒక నాయకురాలు నదీమార్గం మీదుగా ఓటర్లను కలువనున్నారు.

గంగా నది మీదుగా వెళ్లడం ద్వారా ప్రియాంక… యాదవేతరులైన కుష్వాహా, షాక్య, కచహార్, కేవాత్, మల్లా, నిషాద్, కష్యప్, మౌర్య, రాజ్‌భార్ కులాల ప్రజలను కలిసే అవకాశం ఉంది. గంగానది సమీపాన ఎక్కువగా ఉండేది వారే. రాష్ట్రంలోనీ బీసీల్లో 15 శాతం వీళ్లే ఉన్నారు. కాబట్టి వీళ్ళను ఆకట్టుకునే పనిలో భాగంగా ప్రియాంకా గాంధీ గంగా యాత్ర సాగనుంది.

ప్రయాగ్ రాజ్ లోని బడే హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించి మొదట గంగా సంగమం వద్ద చట్నాగ్ లో గంగా పూజను జరుపుకుని యాత్రను ప్రారంభించారు. చట్నాగ్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో దమ్ దమ్ వద్ద అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారు. దమ్ దమ్ నుండి సిస్రాకు వెళ్లి అక్కడ ప్రజలతో సమావేశం కానున్నారు. తర్వాత తుతిహర్ మరియు కౌన్దియార చేరుకుని పుల్వామా అమరవీరుడు మహేష్ రాజ్ యాదవ్ కుటుంబాన్ని కలుసుకోనున్నారు ప్రియాంక. మొత్తంగా ప్రియాంక చేపట్టిన ఎన్నికల ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.