వ్యక్తిగత గోప్యత అనేది వ్యక్తుల ప్రాథమిక హక్కేనని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని తొమ్మిది న్యాయమూర్తుల ధర్మాసనం గురువారం తీర్పునిచ్చింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు తదితర వాటికి ఆధార్ కార్డును తప్పనిసరి చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ విషయంపై చర్చించేందుకు తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. కొద్ది రోజులపాటు వాదోపవాదాలు విన్న విస్త్రత రాజ్యాంగ ధర్మాసనం.. ఆగస్టు 2న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.
ఈ మేరకు వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు కిందకు వస్తుందని పేర్కొంటూ తీర్పు వెల్లడించింది. .వ్యక్తిగత గోప్యత జీవితానికి సంబంధించిన అంతర్గత విషయమని.. ప్రైవసీపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల ఇతర కేసులపై ప్రభావం పడే అవకాశాలున్నాయని కోర్టు స్పష్టం చేసింది. ప్రధానంగా ఆధార్‌పై ప్రైవసీ తీర్పు ప్రభావం చూపే ఛాన్సుంది. ఆధార్‌లో ఉండే బయోమెట్రిక్ డేటాను ప్రభుత్వం అన్ని అంశాలకు జోడిస్తున్నది. దీనిపై వ్యతిరేకత వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పు కీలకంకానున్నది. ఆధార్ నెంబర్ ద్వారా వ్యక్తిగత విషయాలన్నీ వెల్లడవుతున్న తరుణంలో సుప్రీం తీర్పు ఆధార్ అనుసంధాన ప్రక్రియపై ప్రభావం పడే ఛాన్సుంది. రెండు రోజుల క్రితం ట్రిపుల్ తలాక్ చట్ట విరుద్ధమని, పార్లమెంట్ ఆరు నెలల్లోగా చట్టం చేసే వరకూ తలాక్ చెప్పడాన్ని నిషేధిస్తున్నామని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.