దేశ ప్రజలందరి ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు ప్రధాని మోదీ. . ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తిరుపతికి వచ్చిన నరేంద్రమోడీ ‘ప్రజా ధన్యవాద సభ’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ… ‘బాలాజీ పాదపద్మాల సాక్షిగా నాకు మరోసారి అధికారం అప్పగించిన భారత దేశ ప్రజలందరికీ కృతజ్ఞతలు, స్వామికి నా ప్రణామాలు’ అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. ‘రెండోసారి విజయం సాధించిన తర్వాత శ్రీవారి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాను.
తిరుపతికి గతంలో ఎన్నోసార్లు వచ్చాను. అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి తిరుపతి రావడం ఆనందంగా ఉంది. శ్రీలంక పర్యటన ఆలస్యం కావడం వల్ల ఇక్కడికి కొంచెం ఆలస్యంగా వచ్చాను. ఎన్నికలు గెలువడం మాత్రమే కాదు.. ప్రజల మనస్సులను కూడా గెలవాల్సి ఉంది. ఇందుకోసం 365 రోజులూ పార్టీ శ్రేణులు పనిచేయాలి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఏపీలో బలమైన ప్రభుత్వం ఏర్పడింది. సీఎం వైఎస్ జగన్‌కు ఆయన అభినందనలు. ఏపీ ప్రజల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఏపీకి అన్ని విధాల సంపూర్ణ సహకారం అందిస్తాం’ అని మోడీ పేర్కొన్నారు.