కరోనా వైరస్ ప్రభావంతో దేశ ప్రజలు ఆందోళనలో ఉన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, మానవజాతిని కరోనా వైరస్ సంక్షోభంలోకి నెట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘కరోనా’పై మనమంతా ఉమ్మడిగా పోరాడాలని, ఇందుకు దేశ ప్రజల సహకరించాలని కోరారు. ‘కరోనా’పై దేశ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, భారత్ పై దీని ప్రభావం ఉండదనుకోవడం చాలా తప్పు అని అన్నారు. కొన్ని వారాల్లో ఈ వైరస్ బారినపడే బాధితుల సంఖ్య పెరగబోతున్నారని, ‘కరోనా’కు మందులేదు కనుక సంకల్పం, అప్రమత్తతో ఉండాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. ‘కరోనా’తో ప్రపంచం మొత్తం గందరగోళంలో ఉంది, మొదటి ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులు తలెత్తాయని అన్నారు.
మనం ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉన్నట్టేనని, రానున్న వారాల్లో ముఖ్యమైన పనులు ఉంటే తప్ప బయటకు వెళ్లొద్దని, సాధ్యమైనంత వరకూ ఇంటి నుంచే తమ పనులు చేసుకోవాలని, గుమిగూడొద్దని, ఒకరి కొకరు సామాజిక దూరంగా పాటించాలని ప్రజలకు సూచించారు. ‘కరోనా’ నివారణ కోసం ఈ నెల 22న ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని పౌరులందరినీ కోరుతున్నానని అన్నారు. ఆరోజున ఉదయం ఏడు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఎవరూ బయటకు రాకుండా కర్ఫ్యూ పాటిద్దామని, ఇది ప్రజల కోసం ప్రజల ద్వారా ప్రజలే చేసుకునే కర్ఫ్యూగా ఆయన అభివర్ణించారు.
సాయంత్రం 5 గంటలకు ఇంటి గుమ్మాల్లో, కిటికీల వద్ద, బాల్కనీల్లో నిలబడి పౌరులు చప్పట్లు, గంటలు కొడుతూ సంఘీభావం తెలియజేద్దామని అన్నారు. ‘కరోనా’ మహమ్మారిని ఎదుర్కోవాలంటే ఈ కర్ఫ్యూ తప్పదని, ప్రతిరోజూ పది మందికి ఫోన్ చేసి ‘జనతా కర్ఫ్యూ’ గురించి చెప్పాలని, దీనిని యజ్ఞంలా నిర్వహించాలని సూచించారు. మనకు మనంగా విధించుకునే ఈ కర్ఫ్యూ ‘కరోనా’పై అతిపెద్ద యుద్ధంగా మోదీ అభివర్ణించారు. ‘జనతా కర్ఫ్యూ’ను ఆచరించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రావాలని, ఈ కర్ఫ్యూ సందేశం, ఉద్దేశం ప్రజలందరికీ చేరవేయాలని కోరారు.
వైద్యరంగం, మీడియాలో పనిచేసేవాళ్లు తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రజలంతా బాధ్యతలు గుర్తించి మనకు రాకుండా ఇతరులకు సోకకుండా జాగ్రత్త పడాలని ప్రధాని సూచనలు చేశారు. అత్యవసర విభాగాల్లో పనిచేసేవాళ్లు తగిన తీసుకోవాలి. 60-65 ఏళ్లు దాటిన వృద్ధులను ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు వెళ్లనీయరాదని సూచించారు. మాకు ఏమీ కాదన్న నిర్లక్ష్యం, నీకే కాకుండా నీ కుటుంబానికి, సమాజానికి, దేశానికే నష్టమన్నారు.