నిర్భయ దోషులకు ఉరి అమలు..

403
Nirbhaya case
- Advertisement -

ఈ తెల్లవారుజామున 5:30 గంటలకు నిర్భయ దోషులు పవన్ కుమార్, అక్షయ్ కుమార్, ముఖేశ్ సింగ్, వినయ్ శర్మలకు ఉరిశిక్ష అమలు అయింది. తీహార్ జైలు అధికారులు వారికి మరణదండన అమలు చేశారు. అంతకుముందు వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. దోషుల ఆరోగ్య పరిస్థితి బాగున్నట్టు నిర్ధారించారు. ఉరితీత నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టిన అధికారులు జైలును లాక్‌డౌన్ చేశారు. మరోవైపు, జైలు బయట జనం పెద్ద సంఖ్యలో గుమిగూడారు.

మీరట్ నుంచి వచ్చిన తలారి పవన్ జల్లాడ్ నిర్భయ దోషులను ఉరితీశాడు. దక్షిణాసియా దేశంలోనే అతి పెద్దదైన తీహార్ జైలులో ఒకే నేరానికి సంబంధించి నలుగురిని ఉరితీయడం ఇదే తొలిసారి. ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు చివరి క్షణం వరకు దోషులు చేసిన ప్రయత్నాలేవీ ఫలితంచలేదు. చట్టపరంగా వారికి ఉన్న అన్ని హక్కులు ఉపయోగించుకున్నారు. అయినప్పటికీ ఊరట లభించలేదు. దీంతో ఘటన జరిగిన ఏడేళ్ల తర్వాత వారికి ఉరిశిక్ష అమలైంది. దోషులను ఉరి తీయడంపై నిర్భయ తల్లిదండ్రులు హర్షం ప్రకటించారు. తమకు న్యాయం జరిగిందని, నిర్భయ ఆత్మకు శాంతి చేకూరిందని వ్యాఖ్యానించారు.

- Advertisement -