సామ్రాజ్యకాంక్ష ఉన్న దేశాలు చరిత్రలో కొట్టుకుపోయాయని, అలాంటి దేశాలు వెనక్కి తిరిగి వెళ్లిపోయాయన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. లేహ్‌లో ఆకస్మిక పర్యటన చేసిన ప్రధాని….విస్తారవాదం కాదు.. వికాసవాద యుగం కావాలన్నారు. వికాసవాది మాత్రమే భవిష్యత్తుకు ఆధారం అవుతారన్నారు. విస్తారవాదులే మానవ వినాశనానికి కారణమయ్యారన్నారు. యావత్ ప్రపంచం.. విస్తారవాదానికి వ్యతిరేకంగా ఒక్కటైందన్నారు.
గాల్వన్ లోయలో జరిగిన దాడిలో అమరులైన సైనికులకు నివాళి అర్పిస్తున్నట్లు మోదీ తెలిపారు. మీరు ప్రదర్శించిన ధైర్యసాహాసాలు ప్రతి ఒకరి ఇంట్లో ప్రతిధ్వనిస్తున్నాయని ప్రధాని తెలిపారు. మీలోని అగ్నిని, ఆవేశాన్ని.. భారతమాత శత్రువులు చూశారన్నారు. మీ త్యాగాలు, బలిదానాలు, పోరాటం వల్లే ఆత్మనిర్భర భారత్ సంకల్పం నెరవేరుతుందని సైనికులను ఉద్దేశించి మోదీ తెలిపారు.
బలహీనంగా ఉన్నవారెప్పుడూ శాంతిని కాంక్షించరని, శాంతి కావాలంటే ధైర్యం చాలా ముఖ్యమైందని ప్రధాని అన్నారు. ఉత్తమమైన మానవ విలువల కోసం మనం పనిచేశామని వెల్లడించారు. మహిళా సైనికుల్ని చూస్తున్నానని, కదనరంగంలో ఇలాంటి సందర్భం ప్రేరణను కలిగిస్తుందని, మీ వైభవం గురించే నేను మాట్లాడుతున్నానని సైనికులను ఉద్దేశించి మోదీ అన్నారు.