2019 సంవత్సరం భారతదేశ చరిత్రలోనే కీలకమైనదని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్పష్టం చేశారు. నవ భారత్ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకుసాగుతుందన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడిన రామ్ నాథ్… అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపట్టిందని… నాలుగేళ్లలో ప్రజల
ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చిందన్నారు.
ఈ ఏడాదే మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలను జరుపుకుంటున్నాం. ఇదే ఏడాది ఏప్రిల్ 13న పంజాబ్ లోని జలియన్ వాలాబాగ్ దురాగతం జరిగి వందేళ్లు పూర్తి అవుతాయి. మనందరి ఉజ్వల భవిష్యత్ కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరులందరికీ నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను అని తెలిపారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచే అవినీతి, ఆశ్రిత పక్షపాతం లేకుండా దేశ ప్రజల కష్టాలను దూరం చేసేందుకు ప్రయత్నించిందన్నారు.నాలుగేళ్లలో 13 కోట్ల గ్యాస్ కనెక్షన్లు..ఇచ్చామన్నారు. ప్రజల ఆరోగ్యం, చదువు, పారిశుద్ధ్యం సహా ఇతర మౌలిక సదుపాయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించామని చెప్పారు.
గాంధీజీ ఆశయాల సాధన కోసం పని చేస్తున్నాం. పేదల జీవితాలను బాగు చేయడమే ప్రభుత్వ లక్ష్యం. పేదరిక నిర్మూలన, రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా లక్ష మందికి నివాస యోగ్యం కలిగింది. గృహ నిర్మాణాల్లో సమస్యలు తొలగించేందుకు రేరా చట్టం అమల్లోకి తెచ్చామన్నారు.
పలు రాష్ర్టాల్లో కొత్తగా ఎయిమ్స్ ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపేలా కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. దివ్యాంగులకు ఉపాధి అవకాశాల కోసం నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు చేపట్టామని రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు.