ప్రపంచంలో వేగంగా అభివృద్ది చెందుతున్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. అంతర్జాతీయ మార్కెట్ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తరుణంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి సాధిస్తోందని ప్రణబ్ ప్రశంసించారు. నగదురహిత లావాదేవీలు మరింత పెరగాలని, ఇందువల్ల ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని నొక్కిచెప్పారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ఆయన ప్రసంగించారు. రిపబ్లిక్ డే సందర్భంగా సాయుధబలగాలకు, దేశ విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ఉందన్నారు. మానవ వనరుల్లో రెండో స్థానంలో ఉన్నామన్నారు. 130 కోట్ల జనాభా కలిగిన బలమైన దేశం భారత దేశమన్నారు. దేశంలో అక్షరాస్యత శాతం నాలుగు రెట్లుపెరిగిందన్నారు రాష్ట్రపతి ప్రణబ్.
ఉగ్రవాదాన్ని తరిమికొట్టేందుకు కంకణబద్ధులు కావాలని, ఉగ్రశక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఓర్పు, సహనం, ఇతరులను గౌరవించడం వంటి సమున్నత విలువలు ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన ప్రజాసామ్యం సాధ్యమవుతుందన్నారు. ’68వ రిపబ్లిక్ దినోత్సవం ముందు మనం ఉన్నాం. అయినప్పటికీ వ్యవస్థలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. వాటిని మనం గుర్తించి సరిచేసుకుంటూ ముందుకు వెళ్లాలి’ అని సూచించారు.
నల్లధనం స్తంభింపచేయడం వల్ల తాత్కాలిక ఆర్థిక మందగమనం ఉంటుందన్నారు. నోట్లరద్దు అంశంపై పార్లమెంటు శీతాకాల సమావేశాలను స్తంభింపజేయడంపై పరోక్షంగా ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, కొన్ని గందరగోళాలున్నా మనది విజయవంతమైన ప్రజాస్వామ్యమని అన్నారు. అభివృద్ధిపరంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. ‘డిజిటల్ ఇండియా’, ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి పథకాల వల్ల దేశానికి లబ్ధి చేకూరుతుందని ప్రణబ్ ముఖర్జీ అన్నారు.