అక్కినేని నాగచైతన్య,శృతిహాసన్,అనుపమ పరమేశ్వరన్ హీరో,హీరోయిన్లుగా తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రేమమ్. మలయాళంలో ఘనవిజయం సాధించిన ప్రేమమ్ సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేసి తెరకెక్కించారు దర్శకుడు చందు మొండేటి. రొమాంటిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన నాగచైతన్య ప్రేమమ్ ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంది..?అసలు ‘ప్రేమమ్’ కథేంటీ ?తేలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథ :
ప్రతీ వ్యక్తి జీవితంలోని మూడు దశల్లో కలిగే ప్రేమ కథలనే ప్రేమమ్లో సినిమాటిక్గా చూపించారు. టీనేజ్ నుంచి అంటే 2000 సంవత్సరం నుంచి ఈ కథ మొదలవుతుంది.15 ఏళ్ల వయసులో సుమ(అనుపమా పరమేశ్వరన్)ను ఇష్టపడతాడు విక్కీ(నాగచైతన్య). ఆ వయసులోనే కవితలతో ప్రేమలేఖలు రాస్తాడు. అయితే సుమ మాత్రం తాను మరో అబ్బాయిని ప్రేమించానని…పెళ్లి చేసుకోబోతున్నాని చెబుతుంది. దీంతో మొదటి ప్రేమకు పుల్ స్టాప్ పడుతుంది.
తిరిగి ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు లెక్చరర్ సితార(శృతిహాసన్)ను చూసి మనసు పారేసుకొంటాడు. కానీ రెండోసారి విక్రమ్‌కు నిరాశే ఎదురై ఈ ప్రేమ కథ కూడా మధ్యలోనే ముగిసిపోతుంది. తర్వాత వృత్తిలో స్థిరపడ్డాక విక్కీ జీవితంలోకి సింధు(మడోనా సెబాస్టియన్) ఎంటరవుతుంది. తర్వాత ఏం జరుగుతుంది? విక్కీకి సింధుకి ఉన్న సంబంధం ఏంటీ? సింధుని పెళ్లి చేసుకోవాలనుకున్న విక్కీకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి..అన్నదే మిగితా కథ.
ప్లస్ పాయింట్ :
తన కోసమే పుట్టిందీ కథ అన్నట్టుగా ‘ప్రేమమ్’లో ఒదిగిపోయాడు నాగచైతన్య. తన కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. మూడు రకాల షేడ్స్‌లో అద్భుతంగా నటించి…పాత్రలకు ప్రాణం పోశాడు. హీరోయిన్లుగా అనుపమా పరమేశ్వరన్, శృతిహాసన్, మడోనా సెబాస్టియన్లు పర్ఫెక్ట్గా సూట్ అయ్యారు. బ్రహ్మాజీ.. నర్రా శ్రీనివాస్.. చైతన్యకృష్ణ.. ప్రవీణ్.. శ్రీనివాస్‌రెడ్డి తదితరులు కామెడీ బాగా పండించారు. కథానాయకుడు వెంకటేష్ డీసీపీ రామచంద్ర పాత్రలో తళుక్కున మెరిసి అలరించారు. ఆయన పాత్ర ప్రభావం సినిమాపై చివరివరకూ ఉంటుంది. నాగార్జున వాయిస్ ఓవర్ కూడా సినిమాకి హైప్ క్రియేట్ చేసింది.
మైనస్ పాయింట్స్:
ప్రేమకథలకి ఫీల్ చాలా ముఖ్యం. అక్కడక్కడ ఈ చిన్పపాటి తడబాటు కనిపిస్తుంది. బ్రేకప్ అయినప్పుడు వచ్చే సన్నివేశాలు కానీ మరింత శ్రద్ధ తీసుకొని ఉంటే వేలెత్తి చూపించే అవకాశమే ఉండేది కాదన్న అభిప్రాయం కలుగుతుంది. సెకండ్ హాఫ్ లెంగ్త్ కాస్త తగ్గించి ఉంటే బాగుండేది.
సాంకేతిక నిపుణులు :
సాంకేతికంగా ఈ సినిమాకి మంచి మార్కులే పడతాయి. విజయవంతమైన సినిమాని రీమేక్ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నింటిని తీసుకోవటంలో దర్శకుడు చందు మొండేటి వందశాతం సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ముఖ్యంగా విక్కీ- సింధుల కథ నేటి వాతావరణాన్ని కళ్ల కడుతుంది. కథా కథనాలలో ఎక్కడ మలయాళ సినిమా అన్న భావన కలుగకుండా తెలుగు నేటివిటికీ తగ్గట్టుగా చేసిన మార్పులు సినిమాకు ప్లస్ అయ్యాయి. కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం.. గోపీసుందర్.. రాజేశ్ మురుగేశన్ సంగీతం చిత్రానికి ప్రాణం పోసింది. చందు మొండేటిలో ఎంత చక్కటి దర్శకుడు ఉన్నాడో.. అంత మంచి రచయిత కూడా ఉన్నాడన్న విషయాన్ని ఈ సినిమా చెప్పేస్తుంది. చాలా చోట్ల పంచ్‌లు బాగా పేలాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
ప్రేమకథలకి ముగింపు ఉండొచ్చు కానీ.. ప్రేమ తాలూకు జ్ఞాపకాలకి మాత్రం కాదని చెప్పే కథ ప్రేమమ్.ఆకట్టుకునే స్క్రీన్ ప్లే, పర్ఫెక్ట్ టైమింగ్ తో సాగే కామెడీ, ఫస్టాఫ్, సెకండాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ప్లస్ పాయింట్స్ కాగా కథలోని రెండవ ప్రేమ కథలోని కొన్ని బోరింగ్ సన్నివేశాలు మైనస్ పాయింట్స్. ఓవరాల్గా ప్రేమమ్.. నాగచైతన్య కెరీర్లో బెస్ట్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్న ‘అందమైన ప్రేమకథల రొమాంటిక్ జర్నీ’ ప్రేమమ్.
విడుదల తేదీ:07/10/2016
రేటింగ్:3.5/5
నటీనటులు:నాగచైతన్య,శృతిహాసన్,అనుపమా పరమేశ్వరన్,మడోనా సెబాస్టియన్
సంగీతం : గోపిసుందర్
నిర్మాత : ఎస్ రాధాకృష్ణ, పిడివి ప్రసాద్, ఎస్ నాగవంశీ
దర్శకత్వం : చందు మొండేటి