విశ్వహిందూ పరిషద్(వీహెచ్‌పీ) అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోణలు చేశారు. తనను చంపేందుకు కొందరు కుట్ర పన్నారని పేర్కొన్నారు. రామమందిరం, గోవధ వంటి అంశాలపై మాట్లాడకుండా గొంతు నొక్కుతున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం కొద్దిసేపు కనిపించకుండాపోయిన తొగాడియా.. అహ్మదాబాద్‌లో మంగళవారం విలేకర్ల సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. తనను ఎన్‌కౌంటర్ చేసి చంపేందుకు రాజస్థాన్ పోలీసులు వచ్చారంటూ సోమవారం సందేశాలు వచ్చాయని తెలిపారు.
దీంతో రాజస్థాన్‌లోని గంగాపుత్‌లోగల న్యాయస్థానం ఎదుట హాజరయ్యేందుకుగాను అహ్మదాబాద్ విమానాశ్రయానికి ఆటోలో వెళ్తుండగా దారిలోనే స్మృహ కోల్పోయానని చెప్పారు. స్మృహలోకి వచ్చేసరికి ఆస్పత్రిలో ఉన్నట్లు పేర్కొన్నారు. తనపై కుట్రలు పన్నుతున్నవారి పేర్లను సరైన సమయంలో బయటపెడతానన్నారు. పాత కేసుకు సంబంధించి రాజస్థాన్ పోలీసులు ప్రవీణ్ తొగాడియాను (ఐపీసీ సెక్షన్ 188 కింద) అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లగా..ఆయన కనిపించలేదు.
ప్రవీణ్ తొగాడియా షుగర్ లెవల్స్ తగ్గడంతో సోమవారం ఉదయం పల్ది ఏరియాలోని చంద్రమణి ఆస్పత్రిలో చేరారు. తాజాగా ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్లు చేశారు. కేంద్రప్రభుత్వం తనను వేధిస్తోందని ప్రవీణ్ తొగాడియా ఆరోపించారు. తన ఆరోగ్యం కుదుటపడగానే గుజరాత్ పోలీసులకు లొంగిపోతానని ప్రవీణ్ తొగాడియా తెలిపారు.