సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా జంటగా నటించిన చిత్రం ప్రతిరోజు పండగే. ప్రముఖ దర్శకుడు మారుతి ఈసినిమాను తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సత్యరాజ్ కీలక పాత్ర పోషించారు. గ్రామీణ నేపథ్యంలో పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న సాయి ధరమ్ తేజ్ కు చిత్రలహరి సినిమాతో హిట్ కొట్టాడు. చిత్రలహరి తర్వాత తేజ్ నటించిన చిత్రం ప్రతిరోజు పండగే ఎలా ఉందో చూద్దాం.
కథః
రాజమండ్రికి చెందిన పసుపులేటి రఘురామయ్య(సత్యరాజ్) కు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉంది. రఘురామయ్య పిల్లలంతా వేరే వేరే చోట్ల స్ధిరపడిపోతారు. అతను మాత్రం రాజమండ్రిలోనే ఒంటరిగా గడుపుతాడు. తన ఇంట్లో పనివాడైన మహేశ్ (మహేశ్ ఆచంట) కాలక్షేపం చేస్తుంటాడు. అయితే ఓ రోజు ఆయనకు తను కాన్సర్ తో ఎక్కువ కాలం బ్రతకననే విషయం తెలుస్తుంది. ఉన్న ఈ కొద్ది రోజుల్లో తన కుటుంబ సభ్యులతో గడపాలని కొరుకుంటాడు. కానీ వాళ్లంతా విదేశాల్లో సెటిలై, బిజీ జీవితాలు గడుపుతున్నారు. వాళ్లకు విషయం చెప్పినా, వీలు చూసుకుని వస్తాం అని చెప్పినా వాళ్లు మాత్రం రారు. తాతపై ఉన్న అమితమైన ప్రేమతో మనవడు సాయి(సాయితేజ్) మాత్రం తండ్రి(రావురమేష్)కి చెప్పకుండా అమెరికా నుంచి ఇండియా వస్తాడు. ఎలాగైన తాతయ్య చివరి రోజుల్లో ఆనందంగా ఉంచాలని నిర్ణయించుకుంటాడు. తన తండ్రితో పాటు బాబాయ్, అత్తయ్యలను ఇండియా రప్పిస్తాడు. అందరూ వచ్చాక సాయి తేజ్ మాత్రం తన తాతయ్య ఆనందంగా ఉండాలని చూస్తుంటే..కొడుకులు, కొడళ్లు మాత్రం ఎప్పుడు చనిపోతడని ఎదురుచూస్తుంటారు. వారిలో సాయి ఎలా మార్పును తీసుకొచ్చాడు? తండ్రి ప్రేమను రఘురామయ్య కొడుకులు ఎలా గుర్తించారు?తాతయ్య కోరిక మేరకు ఏంజెల్ ఆర్ణ(రాశీఖన్నా)ను సాయి పెళ్లి చేసుకున్నాడా?లేదా? అన్నది ఈ చిత్రం కథ.
ప్లస్ పాయింట్స్ః
ప్రస్తుతం ఉన్న సమాజంలో చాలా మంది పిల్లలు తమ తల్లి తండ్రులను పట్టించుకోవడం లేదు. తమ వృత్తిలో బిజీ అయిపోయి తల్లి తండ్రులను ఒంటరి చేస్తున్నారు. ఇలాంటి వాళ్లకి ఈసినిమా చూపిస్తే కళ్ల వెంబడి నీళ్లు రాకుండా ఉండవనే చెప్పాలి. బీటలు వారుతున్న కుటుంబసంబధాలను నేపథ్యంగా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు. అమెరికాలో బిజీగా ఉన్న కొడుకులు కొడల్లు పట్టించుకోకపోవడంతో మనవడు సాయి తేజ్ ఉరికి వచ్చి తాత బాగోగులు చూస్తుంటాడు. ఫస్టాఫ్‌లో వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను అలరిస్తాయి. దర్శకుడు కామెడీ ట్రాక్ ను బాగానే పండించాడని చెప్పుకోవాలి. కామెడీ సీన్లతో సాగుతూ ఇంటర్వెల్ వరకు వచ్చేసరికి కథ ప్రధాన మలుపు తిరుగుతుంది. సెకండాప్‌లోనూ కథ పెద్దగా కనిపించదు. అయితే సెకండాఫ్ లోకు ఎంట్రి ఇచ్చిన దగ్గర నుంచి కథ కదలటం ఆగిపోయింది. ఎక్కడైతే మొదలైందో అక్కడే ఉండిపోయింది. డెప్త్ లోకి వెళ్లకుండా పైపైనే రాసుకున్న సీన్స్ రిపీట్ అనిపించాయి. అవసరానికి మించి ఎక్కువ సెంటిమెంట్ ని అద్దే ప్రయత్నం చేసారు. సాయి తేజ పాత్ర కూడా సెకండాఫ్ లో చాలా తక్కువగా ఉంటుంది. సెకండాఫ్ లో ఎమోషన్స్ బాగా పండించారు . దర్శకుడిగా మారుతి బలం వినోదమే. అది గ్రహిస్తూ ఎమోషనల్ సన్నివేశాల్ని కూడా వినోదాత్మకంగా చూపిస్తూ కథ, కథనాల్ని రాసుకున్నారు. క్లైమాక్స్ ఒకింత లెంగ్తీగా అనిపించినా సినిమాకు ఇదే ప్రధాన బలమని చెప్పవచ్చు. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారిని వారిని కడిగిపారేసేలా క్లైమాక్స్ సీన్లు సాగుతాయి. ఇక, తాతమనవళ్లుగా సత్యరాజ్-సాయి సెంటిమెంట్‌ను పండించారు. సినిమాలో ప్రధానపాత్ర సత్యరాజ్‌దే. టిక్‌టాక్ పిచ్చిలో మునిగిపోయిన ఏంజిల్ అర్ణాగా రాశీ ఖన్నా తన పరిధి మేరకు పాత్రను పండించారు. పాటలు, కొన్ని కామెడీ సీన్లు మినహాగా హీరోయిన్ పాత్రకు అంతగా స్కోప్ లేదు. థమన్ పాటలు బావున్నాయి.
మైనస్ పాయింట్స్ః
కథలో కొత్త దనం లేకపోవడం సినిమాకు కాస్త మైనస్ గా మారింది. కుటుంబ కథ నేపథ్యంలో ఇది వరకు చాలా సినిమాలు వచ్చాయి. దీంతో ఈసినిమాలో కూడా పెద్దగా కొత్తదనం లేదని చెప్పుకోవాలి. కాకుంటే ఉన్న కథను కొంచెం కొత్తగా చూపించాడు దర్శకుడు మారుతి. సెకండాఫ్ లో అక్కడక్కడా బలవంతపు సన్నివేశాలు వచ్చినట్లు అనిపించాయి. దర్శకుడు మారుతి సెకండాఫ్ ఇంకాస్త శ్రద్ధ పెట్టుంటే సినిమా రేంజ్ మారిపోయుండేది. మారుతి చెప్పిన కథ పాతదే అయినా కామెడీ, ఎమోషనల్ తో ముందుకు సాగించాడు.
తీర్పుః
ప్రతిరోజు పండగే అంటూ తెరకెక్కిన ఈచిత్రం ప్రేక్షకులకు మాత్రం సరైన పండగ అనిపించలేదు. కథలో కొంచెం కొత్త దనం ఉంటే సినిమా మరో రేంజ్ లో ఉండేది. దర్శకుడు మారుతి కామెడీ, ఎమోషనల్ ట్రాక్ ను బాగా హ్యాండిల్ చేశాడు. ఫైనల్ గా ఈ మూవీ మెగా ఫ్యామిలీ అభిమానులకు మాత్రం ప్రతిరోజు పండగే.
విడుదల తేదీః 20/12/2019
రేటింగ్ః 2.75/5
నటీనటులుః సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా, రావు రమేష్, సత్యరాజ్ తదితరులు
సంగీతంః థమన్
నిర్మాతఃబన్నీ వాస్
దర్శకత్వంః మారుతి