బాలీవుడ్ దర్శకుడు సంజయ్ భన్సాలీ రూపొందించిన పద్మావతి ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. రాజ్ పుత్‌ల ఆందోళనల నేపథ్యంలో ఆ చిత్ర విడుదలను నిర్మాతలు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక మొత్తానికి ‘పద్మావతి’తో కాకుండా ఇదే సినిమాను ‘పద్మావత్’ టైటిల్‌తో రాబోతోంది.
అయితే ఈ నెల 25న ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ మూవీకి 300 కట్స్ చెప్పినట్లు మీడియాలో పలు కథనాలు వచ్చాయి. ఢిల్లీ, చిత్తోర్‌గఢ్, మేవార్‌కు సంబంధించిన అన్ని సీన్లు కట్ చేయాలని సీబీఎఫ్‌సీ.. భన్సాలీకి చెప్పినట్లు ముంబై మిర్రర్ పత్రిక రాసుకొచ్చింది.
దీనిపై తాజాగా సీబీఎఫ్‌సీ చైర్మన్ ప్రసూన్ జోషి రియాక్టయ్యారు. చరిత్రని వక్రీకరించారని కర్ణిసేన ఆరోపణలు చేసిన నేపధ్యంలో మూవీ టైటిల్‌ని పద్మావత్‌గా మార్చాలని చిత్ర యూనిట్ కి తెలిపామని, అంతేకాకుండా సతిని ఎక్కువ చేసి చూపకూడదని, ఘూమర్ సాంగ్‌లో కేరక్టర్‌కు తగిన మార్పులు చేయాలని చెప్పినట్లు జోషి వెల్లడించారు.
రాజ్‌పుత్‌లు, చరిత్రకారుల సలహా కమిటీ మేరకు కేవలం ఐదు చిన్న సవరణలు మాత్రమే చేసినట్లు ప్రసూన్ పేర్కొన్నారు. అందరి మనోభావాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన విధంగా సినిమాను ఎడిట్ చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా 300 కట్స్ చేసామని వార్తలు రాసి, సీబీఎఫ్‌సీ పరువు తీయోద్దని ఆయన మండిపడ్డారు. కాగా..ఈ చిత్రానికి సెన్సార్ వారు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే.