బాంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో జన సురాజ్ పార్టీ నమోదు చేసిన చారిత్రాత్మక విజయంపై ఆ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ సంతోషం వ్యక్తం చేశారు. బీజేపీ అహంకారానికి, సంప్రదాయ రాజకీయాలకు స్వస్తి పలుకుతూ బాంకీపూర్ ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చారని ఆయన స్పష్టం చేశారు. ఇన్నాళ్లూ రాష్ట్రీయ జనతా దళ్ భయాన్ని చూపి ఓట్లను సొమ్ము చేసుకున్న బీజేపీ వ్యూహం ఈసారి పారలేదని ప్రజలు కుల, మత సమీకరణలను పక్కనపెట్టి అభివృద్ధి, సుపరిపాలన వైపే నిలిచారని తెలిపారు.
ఈ ఉపఎన్నిక ఫలితం కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితం కాదని బీహార్ రాష్ట్రవ్యాప్త ప్రజా భావనకు ప్రతిరూపమని కిశోర్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నాయకత్వం పట్ల ప్రజల్లో ఉన్న అపనమ్మకం, స్థానిక బీజేపీ నాయకుల అతివిశ్వాసం మరియు అహంకారమే వారి ఓటమికి ప్రధాన కారణాలని ఆరోపించారు. ఏ అభ్యర్థిని నిలబెట్టినా గెలుస్తామనే భావనలో ఉన్న బీజేపీ నాయకులకు ఓటర్లు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. ప్రధాని మోదీ ప్రజాదరణ లేదా హిందూత్వ రాజకీయాన్ని నమ్ముకుని బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ప్రజలు ఉపేక్షించరనే సందేశం ఈ తీర్పు ద్వారా వెళ్ళిందని ఆయన పేర్కొన్నారు.
1995 నుండి వరుసగా విజయం సాధిస్తూ బీజేపీకి బలమైన కోటగా పేరొందిన బాంకీపూర్ నియోజకవర్గంలో ప్రశాంత్ కిశోర్ ఘనవిజయం సాధించారు. తన తొలి ఎన్నికల పోటీలోనే ఆయన బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్‌ను 19,324 ఓట్ల భారీ మెజారిటీతో ఓడించి జన సురాజ్ పార్టీ ఖాతాను తెరిచారు.
Also Read:మౌళి తనుజ్..’దొంగ నా కొడుకు’

